భారత రైల్వే ఆల్ టైమ్ రికార్డ్.. 6 నెలల్లో రూ.100కోట్ల జరిమానాలు..

Deekshitha Reddy
భారతీయ రైల్వే అల్ టైం రికార్డు నెలకొల్పింది. ప్రయాణీకులకు సేవలు అందించడంలో కాదండోయ్. ప్రయాణీకుల నుంచి ముక్కు పిండి ఫైన్ వసూలు చేయడంలో మన రైల్వే రికార్డు సాధించింది. ఒకటికాదు, రెండు కాదు, ఏకంగా వంద కోట్ల రూపాయల ఫైన్ కలెక్ట్ చేసి, రైల్వేకు తిరుగులేదని నిరూపించుకుంది. ఇదంతా సాధించింది కేవలం ఆరునెలల్లోనే అంటే నమ్మగలరా.. కేవలం ఆరునెలల్లోనే ఇంత పెద్ద మొత్తాన్ని ఫైన్ల రూపంలో రైల్వే అధికారులు వసూలు చేశారని తాజా లెక్కలు చెబుతున్నాయి. కరోనా కాలంలో అన్ని రంగాలు మరుగునపడిపోతుంటే మన రైల్వే మాత్రం ఇలా కోట్ల రూపాయల ఫైన్ల రూపంలో వసూలు చేస్తూ దూసుకెళ్తోంది.
కరోనా కాలంలో భారతీయ రైల్వేకు కూడా ఆదాయం పూర్తిగా పడిపోయింది. దేశ వ్యాప్తంగా రైళ్లను రద్దు చేయడంతో చాలాకాలం రైళ్లన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టాక కేంద్రం ప్రజలకోసం కొన్ని రైళ్లను పరిమిత సంఖ్యలో నడిపింది. అయితే ఈ ప్రత్యేక రైళ్లతో పెద్దగా ఆదాయం రాలేదు. దీంతో టికెట్ల రూపంలో ఆదాయం తగ్గే సరికి, అధికారులు ఆదాయం రాబట్టేందుకు మరోదారిని కనిపెట్టారు. రైళ్లల్లో టికెట్ లేకుండా ప్రయాణించే వారిని గుర్తించి, భారీగా జరిమానాలు విధించడం ప్రారంభించారు. ఇలా ఫైన్లు వేస్తూ రైల్వేకు భారీగా ఆదాయాన్ని తీసుకొస్తున్నారు.
మన దేశంలో ఎలాగూ చాలామంది టికెట్ లేకుండానే ప్రయాణిస్తుంటారు. చెకింగ్ పెద్దగా ఉండదనే ధీమాతో సునాయాసంగా టికెట్ లేకుండానే వెళ్లిపోతుంటారు. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు రైల్వే సిబ్బంది చెక్ పెడుతున్నారు. ప్రతీ స్టేషన్ లోనూ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకొని చెకింగ్ చేస్తున్నారు. దీంతో చాలామంది దొరికిపోతున్నారు. టికెట్ లేకుండా దొరికిన వారు కనిపిస్తే చాలు.. రైల్వే సిబ్బంది భారీగా ఫైన్లు వేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల ప్రారంభమైనప్పటి నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకూ వంద కోట్ల రూపాయలను టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి వద్ద నుంచి వసూలు చేశారు. ఫైన్లు వసూలు చేస్తున్నారు సరే.. రైళ్లలో వసతుల గురించి కూడా కాస్త పట్టించుకుంటే బాగుంటుందని సగటు ప్రయాణీకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: