ఫేక్ వార్తలు పక్కనపెట్టండి.. ఒమిక్రాన్ వస్తే ఏపీ సిద్ధమేనా..?

Deekshitha Reddy
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు రాకపోకలపైనా ఆంక్షలు విధించాయి. బయట దేశం నుంచి ఎవరు వచ్చినా ఎయిర్ పోర్టుల్లోనే కరోనా కొత్త వేరియంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో నెగెటివ్ వచ్చాకే బయటకు పంపిస్తున్నారు. దీంతో ఎయిర్ పోర్టులవద్ద కూడా రద్దీ కనిపిస్తోంది. మొదట దక్షిణాప్రికాలో కనుగొన్న ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు మెల్లగా అన్ని దేశాలకూ పాకుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో చాపకింద నీరులా పాకిపోయి ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
విదేశాల సంగతి పక్కనపెడితే మనదేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్నాయని తెలిసినా జనం మాత్రం పట్టించుకోవడం లేదు. ఏపీలో కూడా ఒమిక్రాన్ పై వార్తలొస్తున్నాయి. తాజాగా  శ్రీకాకుళం జిల్లాలో ఒకరికి ఒమిక్రాన్ అన్నారు, అయితే అది ఫేక్ వార్త అంటూ ప్రభుత్వం కొట్టిపారేసింది. పోనీ అది ఫేక్ వార్తే అనుకుందాం. మరి పక్కనే ఉన్న కర్నాటకలో బయటపటిన ఒమిక్రాన్ కేసుల సంగతి ఏమిటి..? అది కూడా ఫేక్ అంటే కుదరదు కదా..! కరోనా కొత్త వేరియంట్ వివిధ రాష్ట్రాలకు వ్యాపించేందుకు రోజుల వ్యవధికూడా తీసుకోలేదు. ఏపీలో ఇప్పుడు కాకపోయినా.. మరికొన్నిరోజులకయినా కొత్త వేరియంట్ కేసులు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మాత్రం పెద్దగా కనిపించడం లేదనే చెప్పాలి.
కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ సమయంలో చాలామంది మృతి చెందారు. మరికొందరు చావుకు దగ్గరగా వెళ్లి వెనక్కి వచ్చారు. ఆ పరిస్థితుల నుంచి మనం నేర్చుకున్నదేమిటి..? అని ఆలోచిస్తే మాత్రం ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. ఎందుకంటే కనీసం మాస్కులు పెట్టుకోవడం కూడా జనం పూర్తిగా మానేశారు. ఏదో పోలీసుల ఫైన్ నుంచి తప్పించుకునేందుకు మాస్క్ పెడుతున్నారు తప్ప.. జనంలో భయం పూర్తిగా పోయింది. ఏపీలో అలాంటి జరిమానాలు కూడా లేవు కాబట్టి మరింత రిలాక్స్ గా ఉన్నారు జనం. వాక్సిన్ వేసుకున్నామనే ధీమా కావచ్చు.. లేదా ఇప్పుడప్పుడే కొత్త వేరియంట్ తో ప్రమాదం లేదనే నమ్మకమో గానీ మొత్తానికి జనంలో మాత్రం నిర్లక్ష్యం మాత్రం బాగానే ఉంది. మరోవైపు మన ఆసుపత్రుల్లో కూడా సదుపాయాలు ఏ మాత్రం మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ కనుక పూర్తిగా విజృంభిస్తే ఈ నిర్లక్ష్యానికి కచ్చితంగా తగిన మూల్యం చెల్లించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: