వైఎస్ జగన్: ఇచ్చిన హామీలే ఇబ్బందిగా మారాయా...!

Podili Ravindranath
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... రాజకీయాల్లో ఎదురు లేని వ్యక్తిగా... తిరుగులేని నేతగా ప్రస్తుతం పేరు తెచ్చుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 151 అసెంబ్లీ, 22 లోక్ సభ సీట్లు గెలుచుకుని ప్రతిపక్షానికి గట్టి షాక్ ఇచ్చారు. అంతటితో ఆగలేదు. ఆ తర్వాత జరిగిన పంచాయతీ, పరిషత్ పోరు, మునిసిపాలిటీ ఎన్నికలు, లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలు... ఇలా ఏదైనా సరే... విజయం మాదే అన్నట్లుగా జైత్రయాత్ర సాగించారు. ఇక ఇప్పుడు రెండున్నర ఏళ్ల తర్వాత జగన్ సర్కార్ ఇబ్బందుల్లో పడినట్లుగా తెలుస్తోంది. ఆయన మాటకు ఎదురే లేదంటూ అంతా భావిస్తారు. కానీ ప్రస్తుతం జగన్ సర్కార్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అందుకు ప్రధాన కారణంగా ఆయన ఇచ్చిన హామీలు. చెప్పిన మాటలు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతిపై తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిచ్చింది. మూడు రాజధానుల ఏర్పాటుపై తగ్గేదే లేదన్న జగన్ సర్కార్... ఆ తర్వాత అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వెనక్కి తీసుకున్నారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో  ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. ఆ సమయంలో అన్ని వర్గాల వారికి లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. అందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పిన మాటలే ఇప్పుడు ఇబ్బందిగా మారాయి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేస్తామన్నారు వైఎస్ జగన్. అలాగే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ కూడా అమలు చేస్తామన్నారు. కానీ రెండున్నర ఏళ్లు గడుస్తున్నా కూడా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు మాత్రం అమలు కాలేదు. అదే సమయంలో సంక్షేమ పథకాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు... ఇప్పుడు సర్కార్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్‌సీ అమలుపై ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇక సాక్షాత్తు ముఖ్యమంత్రి తిరుపతిలో ఉద్యోగులకు హామీ ఇచ్చినా కూడా... వెనక్కి తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: