ప్ర‌కాశం జిల్లా వైసీపీ చేజారుతోందా...!

VUYYURU SUBHASH
ఏపీలో అధికార వైసిపికి కంచుకోటగా ఉన్న జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఒకటి. వైసిపి ఆవిర్భావం నుంచి కూడా ప్రకాశం జిల్లాల్లో ఆ పార్టీ తన ఆధిపత్యం చాటుకుంటూ వస్తోంది. 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. తర్వాత నెల్లూరు లోక్‌స‌భ సీటు కు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు లో వైసిపి కి భారీ మెజార్టీ వచ్చింది. 2014లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాకపోయినా కూడా ప్రకాశం జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలిచింది. అలాగే ఒంగోలు ఎంపీ స్థానం కూడా వైసీపీ ఖాతాలో పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కి ఎక్కువ స్థానాలు వచ్చాయి.

2019 లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో వైసిపి 8 చోట్ల విజయం సాధించింది. ఒంగోలు ఎంపీ స్థానం భారీ మెజారిటీతో వైసిపి ఖాతాలో పడింది. అలాంటి జిల్లాలో ఇప్పుడు వైసిపికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. తూర్పు ప్రకాశం లోని నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది. పర్చూరు - అద్దంకి - సంతనూతలపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఈ రెండేళ్లలో చాలా బలోపేతం అయింది. చీరాలలో అధికార వైసీపీలో ఉన్న గ్రూపు తగాదాలు ఆ పార్టీకి మైన‌స్ గా ఉన్నాయి.

విచిత్రమేంటంటే మంత్రి బాలినేని ప్రాతినిథ్యం వహిస్తున్న ఒంగోలు నియోజకవర్గంలోనూ ఈసారి ఆయన పై వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవల ద‌ర్శి న‌గ‌ర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది. గిద్దలూరు - కొండపి - కందుకూరు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. కొండపిలో టిడిపి ఎమ్మెల్యే స్వామి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు.

గిద్దలూరు లో మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కి ఈసారి సానుభూతి పవనాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఎవరు ఊహించని విధంగా చాప కింద నీరులా వ్యతిరేకత పెరుగుతోంది అన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: