టీ కాంగ్రెస్‌లో ఒక సీటు నాలుగు స్తంభాలాట‌..!

VUYYURU SUBHASH
తెలంగాణ లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అసలు అభ్యర్థులే పోటీ లో ఉండ‌రు అనుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఒకే సీట్ కోసం ఏకంగా ముగ్గురు నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఆయనప్పటి నుంచి కూడా కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఈ క్రమంలోనే కొన్ని కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్పుడే టిక్కెట్ల కోసం పోటీ మొదలైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నుంచి పోటీ చేసేందుకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు నేతలు పోటీపడుతున్నారు.
టీ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానా రెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన మిర్యాలగూడలో ఒక ఇంటిని కూడా కొనుగోలు చేసి అక్కడే ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైనా బ‌త్తుల లక్ష్మారెడ్డి కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించుకున్నారు. దీంతో ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది.
ఒకవేళ రఘువీరా రెడ్డి కి సీటు ఇవ్వాల‌ని అనుకుంటే ఆయ‌న‌కు నల్లగొండ ఎంపీ సీటు ఇవ్వాలని లక్ష్మారెడ్డి చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరో నేత అలుగుబెల్లి అమ‌రేంద‌ర్ రెడ్డి కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అమరేందర్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా టిక్కెట్‌ రాకపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇక 1999లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన రేపాల శ్రీనివాస్ కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. 20 సంవత్సరాలుగా తాను పార్టీ మారకుండా పార్టీ కోసమే అంకితభావంతో పని చేస్తున్నానని... ఈసారి తనకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మ‌రి ఫైన‌ల్ గా కాంగ్రెస్ టికెట్ ఎవరికి ద‌క్కుతుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: