ఏపీపై ప్రధాని మోదీ స్పెషల్ కేర్...!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొదటి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొంత అయిష్టంగా ఉన్నారనేది ఏపీలోని రాజకీయ పార్టీల మాట. రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో భారీ ప్యాకేజీ ప్రకటిస్తారని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. కానీ ఆయన మాత్రం చెంబు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారు. ఇక ప్రత్యేక హోదాపై ఎన్నికలకు ముందు తిరుపతి, భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఓకే చెప్పిన ప్రధాని... గెలిచిన తర్వాత మాత్రం సాధ్యం కాదని తేల్చేశారు. ఇక రాష్ట్రంలో భారీ వర్షాలకు ఇప్పటికే దాదాపు 6 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగిందని... తక్షణ సాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కానీ కేంద్రం మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో రాష్ట్ర ప్రజలు ప్రధాని మోదీపై కాస్త ఆగ్రహంతోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతోంది. ఇది మరో 12 గంటల్లో తుపానుగా మారనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇది కళింగపట్నం - పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీనితో జవాద్ తుపానుపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రెండు రాష్ట్రాల పైన ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రధానికి అధికారులు సూచించారు. దీనితో ప్రధాని కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే 35 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించారు. అలాగే అత్యవసర చర్యల కోసం ఇండియన్ ఆర్మీ, నేవీ విభాగాలను కూడా సిద్ధం చేయాలని ప్రధాని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ప్రధాని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే విద్యుత్, టెలికమ్యూనికేషన్, ఆరోగ్యం, తాగు నీరు, వైద్యం లాంటి అత్యవసర సర్వీసులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు ప్రధాని మోదీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: