మండుతున్న గ్యాస్... ఏకంగా 103 పెంపు..!

Podili Ravindranath
మోదీ సర్కార్ ప్రజల నెత్తిన ధరల భారం మోపుతూనే ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజీల్ ధరలతో అల్లాడుతున్న దేశ ప్రజల నెత్తిన ఇప్పుడు... గ్యాస్ బాదుడు పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం సామాన్యుడిపై ధరల మోత మోగిస్తూనే ఉంది. ఇప్పటికే గ్యాస్ ధర వెయ్యి రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు తాజాగా వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా 103 రూపాయల 50 పైసలు పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను నెలలో రెండో సారి పెంచేసింది కేంద్ర ప్రభుత్వం. గత నెలలోనే ఎల్‌పీజీ సిలిండర్లపై ఏకంగా 266 రూపాయలు పెంచేసింది. ఇప్పుడు మరోసారి సెంచరీ బాదేసింది సిలిండర్ ధర. అయితే గృహ వినియోగదారులపై మాత్రం కాస్త కనికరం చూపించింది. గృహ అవసరాల కోసం వాడే గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం యథతథంగా ఉంచేసింది. వాణిజ్య అవసరాల కోసం 19 కేజీల సిలిండర్‌లు వినియోగిస్తారు. ఇంటికి వాడే సిలిండర్‌ను 14 కేజీలుగా రూపొందిస్తారు.
ప్రస్తుతం గృహ వినియోగదారులపై ఎలాంటి భారం మోపలేదు కేంద్రం. పెంచిన కమర్షియల్ గ్యాస్ ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమల్లోకి వచ్చాయి కూడా. కమర్షియల్ గ్యాస్ ధరను రెండు నెలల్లోనే ఏకంగా 369 రూపాయలు పెంచేసింది కేంద్రం. తాజా పెంపుతో కమర్షియల్ గ్యాస్ ధర ఏకంగా 2 వేల రూపాయలు దాటేసింది. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ ధర ప్రస్తుతం ఏకంగా 2 వేల 104 రూపాయలకు చేరుకుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో 19 వందల 50 రూపాయలుగా ఉన్న సిలిండర్ ఇప్పుడు 2 వేల 51 రూపాయలు పలుకుతోంది. కోల్‌కతాలో 2 వేల 73 రూపాయలు, చెన్నై నగరంలో ఏకంగా 2 వేల 234 రూపాయలుగా ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పలుకుతోంది. డొమెస్టిక్ కేటగిరిలో ఎల్‌పీజీ సిలిండర్ ధర 8 వందల 99 రూపాయలుగా ఉంది. ఈ ఏడాది ఆరంభంలో 694 రూపాయలుగా ఉన్న డొమెస్టిక్ సిలిండర్... ఇప్పుడు 900 రూపాయలు మార్క్ దాటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gas

సంబంధిత వార్తలు: