రేవంత్ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అవుతాయా..?

Paloji Vinay
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీని బ‌ల‌ప‌రిచేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఏడున్న‌రేళ్లుగా తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఉన్న‌దా అంటే ఉంది త‌ప్పా పెద్ద ప్ర‌భావాన్ని ఏం చూప‌లేక‌పోయింది. ఇప్పుడు కొత్త పీసీసీగా రేవంత్ రెడ్డి ప‌ద‌వి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో హ‌స్తం పార్టీలో కొత్త ఉత్సాహం ఉత్తేజం నిండింది. అలాగే రేవంత్ రెడ్డి రాక‌ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంద‌నేది స్ప‌ష్టంగా కనిపిస్తోంది. బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలినాటి నుంచే పార్టీ బ‌లోపేతానికి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఆది నుంచి అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌గా ఉంటుంద‌నేది అంద‌రికీ తెలిసిన విష‌యమే.
 
   దీంతో త‌మ సొంత పార్టీ నేత‌ల‌పైనే బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం కోసం పార్టీ సీనియ‌ర్లు చాలా మంది ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, వీరంద‌రిని ప‌క్క‌న పెట్టి తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించింది కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం. ఈ నిర్ణ‌యంతో  సీనియ‌ర్లు త‌న‌పై గుర్రుగా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి అంద‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌లుపుకుపోయాడు. త‌రువాత పార్టీ బ‌లోపేతం చేయ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న నేత‌లు, కార్య‌క‌ర్త‌లు బీజేపీ వైపు చూస్తున్న క్ర‌మంలో రేవంత్ రెడ్డి రాకతో వాళ్లంతా కాంగ్రెస్ వైపు చూసేలా చేస్తున్నాడు.

  కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేయ‌డం కోసం ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకుపోవ‌డానికి పావులు క‌దుపుతున్నాడు. బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ గా సాగుతున్న పొలిటిక‌ల్ పోరులో కాంగ్రెస్ పార్టీ క‌నుమ‌రుగు అవుతుంద‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీంతో పార్టీని ముందుకు న‌డ‌ప‌డానికి అలాగే పార్టీని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకుపోవ‌డానికి రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న పార్టీల‌తో క‌లిసి ప‌య‌నించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఆ పార్టీలు హ‌స్తంతో క‌లిసి న‌డిచేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేస్తాయా..?  రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అవుతాయా లేదా కాలం నిర్ణ‌యిస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: