ధాన్యం కొనుగోలు పై కేసీఆర్ తో చ‌ర్చ‌కు సిద్దమా..? కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి

N ANJANEYULU
ధాన్యం కొనుగోళ్ల‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విసిరిన స‌వాల్‌ను స్వీక‌రిస్తున్నాన‌ని కేంద్ర సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్‌రెడ్డి వెల్ల‌డించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద సీనియర్ పాత్రికేయుల స‌మక్షంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోరిన‌విధంగా చ‌ర్చ‌ల‌కు తాను సిద్ధ‌మేన‌ని పేర్కొన్నారు. నాగ‌రికలో భాష‌లో మాట్లాడుతున్నాను అని కేసీఆర్ అంగీక‌రిస్తే.. తాను చ‌ర్చ‌కు వ‌స్తాను అని కేంద్ర‌మంత్రి స్ప‌ష్టం చేసారు. అస‌భ్య ప‌ద‌జాలం వినియోగంలో కేసీఆర్ తో గెలువ‌లేనందున ఆ విష‌యంలో ముందే ఓట‌మిని ఒప్పుకుంటున్నాన‌ని వెల్ల‌డించారు కిష‌న్‌రెడ్డి.
మంగ‌ళ‌వారం ఢిల్లీలో విలేక‌ర్ల‌తో మాట్లాడిన మంత్రి కిష‌న్‌రెడ్డి.. రెండు నెల‌ల కాలం నుంచి క‌ల్లాల‌లో ధాన్యం రోడ్ల‌పై కుప్ప‌ల‌తో బాధ‌ప‌డుతున్న రైతుల‌కు ధైర్యం ఇచ్చే ప్ర‌య‌త్నం చేసాన‌ని స్ప‌ష్టం చేశారు. కేంద్ర‌మంత్రి పియూష్ గోయ‌ల్‌తో మాట్లాడిన త‌రువాత‌నే చివ‌రి బ‌స్తా వ‌ర‌కు కొంటామ‌ని చెప్పిన‌ట్టు గుర్తు చేశారు కిష‌న్‌రెడ్డి. యాసంగి పంట అనేది త‌రువాత విష‌యం.. ముందు పండించిన వానాకాలం పంట‌ను కొనుగోలు చేయాల‌ని ఆయ‌న సూచించారు. ఇటీవ‌ల జ‌రిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక త‌రువాత తెలంగాణ ముఖ్య‌మంత్రి అభ‌ద్ర‌త భావంతో ఉన్నందున దాదాపు గంట‌న్న‌ర పాటు మీడియా ముందు తిట్ల పురాణం కొన‌సాగించార‌ని ఎద్దేవా చేశారు కిష‌న్‌రెడ్డి.
ముఖ్యంగా  ముఖ్య‌మంత్రి ప‌ద‌వీని ఎడ‌మ‌కాలి చెప్పుతో పోల్చిన వ్య‌క్తి అంత‌క‌న్నా గొప్ప‌గా ఎలా మాట్లాడుతార‌ని పేర్కొన్నారు. తాను కేంద్ర‌మంత్రి అయినందుకు ముఖ్య‌మంత్రి బాధ ప‌డితే తాను ఏమి చేయ‌లేను అని స్ప‌ష్టం చేసారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విత్త‌నాలు మార్చుకున్నారు అని, తెలంగాణ‌లో కూడా విత్త‌నాల‌ను మార్చుకుంటే యాసంగిపంట వేయ‌వ‌చ్చ‌ని సూచించారు. నేను కేంద్ర మంత్రిని అవ్వ‌డం కేసీఆర్‌కు ఇష్టం ఉందో లేదో తెలియ‌దు కానీ, కేంద్ర మంత్రి అయిన త‌రువాత అపాయింట్‌మెంట్ అడిగితే కేసీఆర్ ఇవ్వ‌లేద‌ని గుర్తు చేసారు. ఫోన్ చేసినా స్పందించ‌లేద‌ని, క‌లుస్తాను అన్న ప‌ట్టించుకోలేద‌ని, కేంద్ర‌మంత్రిగా ఢిల్లీలో ఉన్న తెలంగాణ బిడ్డ స‌హ‌కారం తీసుకుందాం అని రాష్ట్ర ప్ర‌భుత్వం ఏనాడు అనుకోలేద‌ని వివ‌రించారు. రాష్ట్ర అభివృద్ధికి కోసం కేంద్రం నుంచి రావాల్సిన వాటి కోసం తాను పాటుప‌డుతున్నాన‌ని, న‌మ్మిన సిద్ధాంతాల కోసం ప‌ని చేస్తున్నాన‌ని చెప్పారు.
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన గ‌డ్డ‌పైనే నేను పుట్టాను. ఆయ‌న తిట్ల‌కు భ‌య‌ప‌డే వ్య‌క్తిని కాద‌ని, ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు నాకు ఏమి బాధ లేద‌ని .. ఎవ‌రూ ఏమిటి అనేది ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని వెల్ల‌డించారు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి. కేసీఆర్ వాడే భాష‌తో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, రాష్ట్రానికి చెడ్డ పేరు వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. కేసీఆర్ పై అస‌భ్య ప‌ద‌జాలం వాడినందుకు పాత్రికేయుల‌ను జైలులో పెట్టార‌ని, ఇప్పుడు అదేభాష‌తో విమ‌ర్శలు చేస్తున్నార‌ని..? ఇదెక్క‌డి న్యాయ‌మ‌ని, ప్ర‌పంచ దేశాల ముందు భార‌త్ ను కించ‌ప‌రిచేలా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కిషన్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: