ఆ ఇద్దరు తెరాస నేతల రాజీనామాల వెనుక .. వ్యూహం ఇదేనా ..!

MOHAN BABU
ఎమ్మెల్సీ ఎన్నికలు గులాబీ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయా..? పార్టీ కోసం కష్టపడ్డ నేతలను కాదని కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం ఆ పార్టీలో చిచ్చు రేపుతోందా..? తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. పదవులు ఆశించి భంగపడ్డ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ముఖ్య నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగారు. టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలతో  లేఖ రాశారు. టిఆర్ఎస్ పార్టీలో రాష్ట్రప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ నేత గట్టు రామచంద్ర రావు కూడా రాజీనామా చేశారు. తాను కూడా ఆశించిన స్థాయిలో పార్టీలో రాణించలేకపోయానన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని ఆయన లేఖ రాశారు.

 అందుకే టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తనకు అవకాశం వస్తుందని గట్టు భావించారు. కానీ ఆ స్థానాన్ని తాతా మధుకి కేటాయించారన్న మనస్తాపం కూడా రాజీనామాకు కారణమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన కర్నె ప్రభాకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బొంతు రామ్మోహన్, నారదాసు లక్ష్మణ్ రావుకు మొండిచేయి చూపారు. ఇక కేసీఆర్ కు మద్దతుగా నిలిచిన చాడ కిషన్ రెడ్డి, శ్రీహరి రావు లాంటి వారికి నిరాశే  మిగిలింది. పార్టీలు మారి వచ్చిన మందా జగన్నాథం, వేణుగోపాలచారి లాంటి సీనియర్ లు కూడా అసంతృప్తితో ఉన్నారు. బొమ్మెర రామ్మూర్తి, సాయిచంద్, సీతారామ్ నాయక్ లు ఈసారి ఛాన్స్ ఇవ్వకపోవడం పట్ల నారాజుగా ఉన్నారు. అయితే సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ కోటరీలో కీలకంగా వ్యవహరించే కొంతమంది నేతలు లాబీయింగ్ చేసి మరీ తమ అనుచరులకు పదవులు ఇప్పించుకున్నారనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కోసం మొదటినుంచి పనిచేసిన శ్రీహరిరావును కాదని కేటీఆర్ కోటరీ నుండి దండే విటల్ కు స్థానం కల్పించారనే వాదన వినిపిస్తోంది. మరోవైపు వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో కేటీఆర్ అనుకూల నేతలకే మరోసారి టికెట్ ఇచ్చారని గులాబీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పదవులు రావని డిసైడ్ అయిన నేతలకు బిజెపి గాలం వేస్తున్నట్టు సమాచారం. ఆ బాధ్యతలను మొన్నటిదాకా టిఆర్ఎస్  లో ఉన్న ప్రస్తుత బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భుజాన పెట్టినట్టు తెలుస్తోంది. ఏవైనా మొత్తానికి పదవుల పంపకం టిఆర్ఎస్ పార్టీకి పెనుసవాల్ లు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తున్నాయన్న చర్చ మాత్రం జోరుగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: