జగన్ గుడ్‌న్యూస్.. ఇవాళ వాళ్ల ఖాతాల్లోకి డబ్బులు..?

Chakravarthi Kalyan
ఏపీలోని విద్యార్థులకు జగన్ గుడ్‌ న్యూస్.. ఇవాళ జగనన్న విద్యా దీవెన మూడో విడత నిధులు విడుదల కానున్నాయి. ఇవాళ 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు జగన్ విడుదల చేయనున్నారు. సచివాలయం నుంచి సీఎం జగన్ బటన్‌ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో తీసుకువచ్చిన పథకం ‘జగనన్న విద్యాదీవెన’. ఈ పథకం కింద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నగదును విడతల వారీగా అందిస్తున్నారు.

 
‘జగనన్న విద్యాదీవెన’ సాయాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో  జమ చేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విద్యాదీవెన కింద అందిస్తున్నారు. విద్యాదీవెన మొత్తాన్ని ఏటా నాలుగు విడతలుగా అందిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు ఫీజులో మూడో విడత రీయింబర్స్‌మెంట్‌ నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేయనున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రోజు తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ నగదు బదిలీ చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా బటన్ నొక్కి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. విద్యాదీవెన కోసం ప్రభుత్వ అధికారులు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలను సేకరించారు. ఇలా తల్లుల ఖాతాల్లో నగదు వేయడం వెనుకా ఓ కారణం ఉంది. బోధనా రుసుముల్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమచేస్తే వారు కళాశాలకు వెళ్లి ఫీజులు కడతారని.. ఆ సమయంలో అక్కడ సదుపాయాలు, బోధనా పద్ధతుల్ని పరిశీలిస్తారన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.

తమ పిల్లల చదువులు, బాగోగులు, కళాశాల పరిస్థితులు స్వయంగా తల్లిదండ్రులు పరిశీలిస్తారని.. అందుకే ఈ పథకం ద్వారా నగుదును తల్లుల ఖాతాల్లో వేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ విద్యాదీవెనను ఇప్పటికే రెండు విడతలు అందించారు. జులైలో రెండో విడత అందించగా ఇప్పడు  మూడో విడత అందిస్తున్నారు. మళ్లీ ఫిబ్రవరి 2022లో నాలుగో విడత నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేస్తారు. ఈ  విద్యా దీవెన పథకం కింద పది లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని ప్రభుత్వం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: