జూనియర్ పై ప్రేమ ? తెర వెనుక వైసీపీ ప్రేమ ?

RATNA KISHORE
తెలుగుదేశం పార్టీ మ‌ళ్లీ మ‌రో త‌ప్పిదం చేస్తుంద‌ని తేలిపోయింది. గ‌తంలో మాదిరి కాకుండా ఈ సారి తెలిసి చేస్తుందో తెలియ‌క చేస్తుందో తార‌క్ ను దూరం చేసుకుంటోంది. దీని వ‌ల్ల వ‌చ్చే ఫ‌లితాల‌ను అంచ‌నా వేయ‌లేక‌పోతోంది. కేవ‌లం ఆ ఇద్ద‌రి వ్య‌క్తులు వైసీపీ వైపు ఉన్న కార‌ణంగా (కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ) అహంపూరితంగానో అధికారం రాలేద‌న్న బాధ‌తోనే లేదా అయిష్ట‌పూర్వ‌కంగానో తార‌క్ ను మాత్రం దూరం పెడుతోంది. ఒక‌ప్పుడు త‌న త‌ల్లిని అవ‌మానించారని ఎంతో బాధ‌ప‌డ్డ తార‌క్ కాల క్ర‌మంలో ఆ బాధ నుంచి కోలుకున్నారు. మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్నాక, పెద్దాయ‌న స్థాయి న‌టుడిగా పేరందుకున్నాక ఆయ‌న‌కు  నంద‌మూరి కుటుంబం నుంచి కూడా మ‌ద్ద‌తు పెరిగింది. బాబాయ్ ఆశీర్వాదాలూ ద‌క్కాయి. 


ఈ క్ర‌మంలోనే తార‌క్ కూడా  బాబాయ్ కు ఎంత‌గానో చేరువ‌య్యాడు. ఎన్టీఆర్ పై బాల‌య్య రూపొందింప‌జేసిన బ‌యోపిక్ వేడుక‌ల్లోనూ ఆయ‌న పాల్గొన్నారు. బాబాయ్ ప్ర‌య‌త్నాన్ని మ‌న‌సారా అభినందించి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా తార‌క్ ను చూసి బాబాయ్ బాల‌య్య పొంగిపోయారు కూడా! కానీ ఇప్పుడు రాజ‌కీయం కార‌ణంగా బాల‌య్య కూడా తార‌క్ ను పెద్ద‌గా ద‌గ్గ‌ర చేసుకునేలా లేరు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ద‌గ్గ‌రుండి మ‌రీ వ‌ర్ల రామ‌య్య లాంటి లీడ‌ర్ల‌తో చిన్న రామ‌య్య‌ను తిట్టించ‌డం అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు ఫ్యాన్స్. దీంతో తార‌క్ అభిమానులు టీడీపీకి దూరం కావ‌డం ఖాయం. 


అందుకే నిన్న‌టి వేళ కుప్పంలో  జై లవ కుశ స్పెష‌ల్ షో వేసుకుని మ‌రీ! తార‌క్ సీఎం అంటూ ఎన్టీఆర్ సీఎం అంటూ గోల చేశారు. ఈ గొడ‌వ వెనుక వ్యూహాత్మ‌కంగా వైఎస్సార్సీపీ ఉంద‌న్న వాద‌న ఉంది. దీనిని తార‌క్ ఖండించ‌నూ లేదు. స్పందించ‌నూ లేదు.  విదేశాల్లో ఉన్న కార‌ణంగా తార‌క్ ఇలా చేశారా అనేందుకు కూడా కార‌ణం లేదు. దేశం కానీ దేశంలో ఉన్నా ఇవాళ  సామాజిక మాధ్య‌మాల‌ను వేదిక‌గా చేసుకుని స్పందించ‌డం చాలా సులువు. కానీ జూనియ‌ర్ ఆ ప‌ని చేయ‌లేదు.  దీంతో టీడీపీలో ఓ వ‌ర్గం భ‌గ్గుమంటోంది. మ‌ళ్లీ పాత రోజుల మాదిరిగా జూనియ‌ర్ ను తాము దూరం ఉంచుతామ‌ని చెబుతోంది. ఫ‌లితంగా వైసీపీ అనుకున్న రిజ‌ల్ట్ వ‌చ్చేసింది. రేప‌టి వేళ తార‌క్ కొత్త పార్టీ పెట్టినా పెట్ట‌క‌పోయినా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపి జై జ‌గ‌న్ అని నిన‌దిస్తే చంద్ర‌బాబు ప‌రిస్థితి ఏంటో?

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: