లోక్‌సభ ముందుకు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు...!

Podili Ravindranath
కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం సరిగ్గా ఏడాదిలోనే రద్దు చేసేసింది. కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు... దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు ఏడాది కాలంగా నిరసనలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఎండా, వానా, చలి అనే తేడా లేకుండా... రైతులు వ్యవసాయ చట్టాల రద్దు కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఏకంగా ఎర్రకోటను ముట్టడించారు. భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల సమయంలో....మాక్ అసెంబ్లీ కూడా నిర్వహించారు. కేంద్రాన్ని నిలదీశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో... ఇక చేసేది లేకపోవడంతో వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఈ నెల 19వ తేదీన సిక్కుల పవిత్ర గురువు గురునానక్ జయంతి సందర్భంగా... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించి బిల్లు చేస్తామన్నారు. అన్నట్లుగానే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కూడ నిర్ణయించారు.
ఇప్పుడు చెప్పిన మాటను కేంద్రం నిలబెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లుగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే... కొత్త వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ఎన్‌డీఏ సర్కార్ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ వెంటనే... ఎలాంటి చర్చ లేకుండా... రద్దు బిల్లు ఆమోదం పొందినట్లుగా స్పీకర్ ఓం బిర్లా సభలో ప్రకటించారు. దీంతో కొత్త వ్యవసాయ చట్టాలను ఉప సంహరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎలాంటి చర్చ జరగకుండానే బిల్లు సభలో ఆమోదం పొందడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. సభ వాయిదా అనంతరం ప్రారంభమైన వెంటనే... నరేంద్ర సింగ్ తోమర్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) యాక్ట్ 2020, ఎసెన్షియల్ కమోడిటీస్ (అమెండ్‌మెంట్) యాక్ట్ 2020, ఫార్మర్స్ (ఎంపవర్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ -2020ని వెనక్తి తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సభలో ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: