జగన్‌కు చుక్కలు చూపిస్తామంటున్న ఉద్యోగులు..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్‌కు క్రమంగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆయన అధికారం చేపట్టి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. ఒక విధంగా ఆయన హనీమూన్‌ ముగిసిందనే చెప్పాలి. ఇప్పుడు రాజధాని సమస్యతోపాటు అనేక ఆర్థిక సమస్యలు రాష్ట్రాన్ని చుట్టుముడుతున్నాయి. వీటికి తోడు ఇప్పుడు ఉద్యోగులు కూడా సీఎం జగన్ తీరుపై మండిపడుతున్నారు. ఇన్నాళ్లూ కాస్త ఓపిక పట్టిన ఉద్యగ వర్గం ఇక సహించేది లేదంటోంది.. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని ప్రకటించింది.

పీఆర్‌సీ, ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఇక సర్కారుతో తాడో పేడో తేల్చుకుంటామని ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి స్పష్టం చేస్తున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు  ఆందోళన బాట పట్టారు. డిసెంబరు 7 నుంచి జనవరి 6 వరకు తమ ఆందోళనను వివిధ రూపాల్లో తెలపాలని నిర్ణయించారు. ఈ మేరకు తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. విశాఖపట్నం, తిరుపతి, ఏలూరు, ఒంగోలుల్లో ఉద్యోగుల సదస్సులు నిర్వహించి ఆందోళనను ఉధృతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు.

అయితే ఇదంతా  తొలి దశ ఆందోళన మాత్రమేనంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. ఇకనైనా  ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే రెండో దశను తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. తమ ఉద్యమం కార్యాచరణ గురించి డిసెంబరు 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇవ్వడం ద్వారా చెబుతామని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు తమ సమస్యల గురించి  ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. కానీ.. ఉపయోగం లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే తమ పీఆర్‌సీ సమస్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ హామీ ఇచ్చినా దాన్ని అమలు చేయించలేకపోయారని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ప్రభుత్వం ఉద్యోగులపై వివక్ష చూపిస్తోందని.. ఉద్యోగ సంఘాలకు విలువ, ప్రాధ్యానం లేని పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని వారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: