చివరి వరకు శ్రీవారి సేవలోనే...!

Podili Ravindranath
డాలర్ శేషాద్రి.... కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. ఇక శ్రీవారిని దర్శన భాగ్యం కోసం భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటి భోగ శ్రీనివాసుని వైభోగం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. స్వామి వారికి సేవ చేసుకునేందుకు కోనేటి రాయుడుకి మొక్కుకుంటారు కూడా. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఏ వేడుకల్లో అయినా... ఉత్సవాల్లో అయినా... తప్పనిసరిగా కనిపించే వ్యక్తి డాలర్ శేషాద్రి. శ్రీవారి ఆలయ ఓఎస్‌డీగా వ్యవహరిస్తున్న డాలర్ శేషాద్రి ఈ తెల్లవారుజామున గుండెపోటుతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న శేషాద్రికి... ఈ తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. ఆయనను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దాదాపు నాలుగు దశాబ్దాలకుగా పైగా శ్రీవారి సేవలోనే శేషాద్రి ఉన్నారు. 1978వ సంవత్సరంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రవేశించిన శేషాద్రి... చివరి నిమిషం వరకు కూడా స్వామికి సేవ చేస్తూనే ఉన్నారు.
2007లో పదవీ విరమణ చేసినా కూడా శేషాద్రి సేవలను కొనసాగిస్తున్నట్లు అప్పట్లో టీటీడీ వెల్లడించింది. తిరుమల వెంకన్న ఆలయంలో... జరిగే ఏ వేడుక అయినా సరే... శేషాద్రి లేకుండా జరిగే సమస్యే లేదు. అది ఏ సేవ అయినా సరే... శేషాద్రి ఉండాల్సిందే. ఇక తిరుమలకు ప్రముఖులు వచ్చారంటే... శేషాద్రిని కలవాల్సిందే. రాష్ట్రపతి నుంచి రాష్ట్ర మంత్రుల వరకు ఎవరైనా సరే... శేషాద్రి సమక్షంలోనే శ్రీవారిని దర్శించుకోవాలి. ఒకదశలో శ్రీవారిని తొలగించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా... అది సాధ్యం కాలేదు. శ్రీవారి బ్రహ్మోత్సవ సమయంలో జరిగే వేడుకల్లో శేషాద్రి లేకుండా కనీసం ఒక్క ఫోటో కూడా సాధ్యం కాదు. శ్రీవారి బొక్కసం తాళాలకు ఇంఛార్జ్‌గా ఉన్న శేషాద్రి... తనపై ఎవరెన్ని కుట్రలు చేసినా సరే... శ్రీవారిని విడిచిపెట్టేది లేదని తేల్చేశారు. టీటీడీ నిర్వహించే ఏ వేడుక అయినా సరే శేషాద్రి ఉండాల్సిందే. ఆలయ శంకుస్థాపన అయినా.... ఉత్సవం అయినా సరే. ఇక తిరుమలకు వచ్చే ప్రముఖులకు శేషాద్రి స్వయంగా ప్రసాదాలు అందజేస్తారు. శ్రీవారి సేవలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా శేషాద్రి ప్రత్యేక గుర్తింపు పొందారు. శేషాద్రి లేని లోటు భర్తీ చేయలేమని టీటీడీ జేఈవో ధర్మారెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: