ప్ర‌కాశం టీడీపీలో కొత్త ఉత్సాహానికి కార‌ణ‌మేంటి...!

VUYYURU SUBHASH
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం తొణికిస లాడుతోంది. వాస్తవంగా చెప్పాలంటే 2019 సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిందని చెప్పాలి. కొన్ని జిల్లాల్లో అయితే తెలుగుదేశం పార్టీ అసలు ఖాతా తెరవలేదు. ఉత్తరాంధ్రలోని విజయనగరం - నెల్లూరు జిల్లా తో పాటు రాయలసీమలోని కడప - కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా గెలుచుకో లేకపోయింది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కూడా తెలుగుదేశం పార్టీ కేవలం చంద్రబాబు పోటీ చేసిన కుప్పం సీటు తో మాత్రమే సరిపెట్టుకుంది.
అంత బలమైన వ్యతిరేకత గాలులు వీచినా కూడా ప్రకాశం జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఏకంగా నాలుగు ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ వరుసగా నాలుగో సారి విజయం సాధించారు. పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు , కొండపి నుంచి డోలా బాలా శ్రీ వీరాంజనేయ స్వామి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక చీరాల నుంచి పోటీ చేసిన సీనియర్ నేత కరణం బలరాం స్థానిక పరిస్థితులను ఉపయోగించుకొని 2004 తర్వాత మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అయితే ఆ తర్వాత కరణం బలరాం తన కుమారుడు కరణం వెంకటేష్ తో కలిసి వైసిపి చెంత చేరిపోయారు . ఇక మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ద‌ర్శి న‌గ‌ర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ద‌ర్శి న‌గ‌ర‌ పంచాయతీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో స్థానిక తెలుగుదేశం కేడ‌ర్ క‌సితో ప‌నిచేసి వైసీపీ ని ఓడించింది.
ప్రకాశం వైసీపీలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి లాంటి కీలక నేతల హవా కొనసాగుతోంది. వైసీపీని గెలిపించుకునేందుకు వీరు ఎవ్వ‌రూ ఆస‌క్తి చూప‌క పోవ‌డంతో జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏదేమైనా ద‌ర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు జిల్లా తెలుగుదేశం పార్టీ లో కొత్త ఉత్సాహం నింపింది అని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: