యూపీ ఎన్నికల కోసం అఖిలేష్ నయా ప్లాన్...!

Podili Ravindranath
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు ఐదు నెలల్లో జరగనున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రాన్ని దక్కించుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ కసరత్తు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్ర అయితే దాదాపు రెండేళ్లుగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక అధికార భారతీయ జనతా పార్టీ కూడా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటోంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా యూపీలో సత్తా చాటేందుకు ప్లానింగ్ చేస్తోంది. అందుకోసమే... సమాజ్ వాదీ పార్టీతో ఆప్ పొత్తు పెట్టుకుంది కూడా. అధికారంలోకి వచ్చేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం బెంగాల్ ఎన్నికల్లో మమతా అనుసరించిన మార్గాన్నే అఖిలేష్ కూడా అనుసరిస్తున్నారు. ఖేల్ హోబా పేరుతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలుపు కోసం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై యుద్ధం ప్రకటించారు. ఖేల్ హోబా అంటే బెంగాల్‌లో ఆట మొదలైంది అని అర్థం.
ఇప్పుడు అదే మాదిరిగా అఖిలేష్ యాదవ్ కూడా తమ పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచేందుకు ఓ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. ఖేల్ హోబా తరహాలో ఖడేరా హోబే పేరుతో అఖిలేష్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఖడేరా హోబే పేరుతో ప్రత్యేక పాట కూడా విడుదల చేశారు అఖిలేష్. ఇప్పుడు ఇదే పాట యూపీలోని సోషల్ మీడియాలో పెద్ద వైరల్‌గా మారింది. మమతా చేపట్టిన ఖేల్ హోబా తృణమూల్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. అలాగే బెంగాల్‌లో దీదీకి హ్యాట్రిక్ విజయాన్ని కూడా కట్టబెట్టంది. అదే నమ్మకంతో... అఖిలేష్ కూడా ఖడేరా హోబే అంటూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోని యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు కూడా. యోగీ సర్కార్‌ను గద్దె దింపుతామని ఇప్పటికే అఖిలేష్ శపథం కూడా చేశారు. మరి అఖిలేష్ చేపట్టిన ఖడేరా హోబే.. విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: