పీఆర్‌సీపై వారంలో గుడ్ న్యూస్...!

Podili Ravindranath
తమ సమస్యలు తీరుస్తాడంటూ వైఎస్ జగన్‌కు మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు రెండున్నర ఏళ్లుగా అనుకున్నది సాధించలేక పోయారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తా అంటూ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కానీ రెండున్నర ఏళ్లు గడుస్తున్నా కూడా... ఆ హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఇక పెండింగ్‌లో పీఆర్‌సీ పై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు... పోరాట బాట పట్టారు. ఈ నెలాఖరు లోపు పీఆర్‌సీపై ప్రకటన రాకపోతే... తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం  కూడా ఇచ్చాయి. అలాగే అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద ఉద్యోగులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కనీసం పీఆర్‌సీ నివేదిక కూడా బయట పెట్టలేదని... అలాంటిది తమకు అమలు ఎప్పుడు చేస్తారంటూ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఉద్యోగులు.
ఈ నెల 28వ తేదీ వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు ప్రభుత్వ ఉద్యోగులు. ఆ తర్వాత ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని కూడా హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం దిగి వస్తుందని అంతా భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం తమకు అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగ సంఘంతో ఇవాళ ఓ ప్రకటన ఇప్పించింది. పీఆర్‌సీ పై ఓ వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి పిలుపు వస్తుందని ప్రకటించారు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. వారం రోజుల్లోగా ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు పిలుపు తప్పకుండా వస్తుందన్నారు వెంకట్రామిరెడ్డి. ఈ సమావేశంలో పీఆర్‌సీకి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ప్రతిపాదనలు కోరే అవకాశం ఉంటుందని తెలిపారు వెంకట్రామిరెడ్డి. ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు 40 శాతం ఫిట్ మెంట్ కోరాలని కూడా భావిస్తున్నట్లు తెలిపారు. 2020 నుంచి నగదు రూపంలో తమకు రావాల్సిన బకాయిలను కోరనున్నట్లు కూడా వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న హెచ్ఆర్ఏను ఏ మాత్రం తగ్గించకుండా యథాతథంగా కొనసాగించాలని ఇప్పటికే ప్రభుత్వానికి సూచించినట్లు కూడా వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: