తిరుపతిలో కుంగుతున్న భవనాలు... ప్రజలు బెంబేలు...!

Podili Ravindranath
భారీ వర్షాలు, వరదలు రాయలసీమ వాసులను కంటి మీద కునుకు లేకుండా చేశాయి. కడప జిల్లా వాసులు అయితే వర్షం అనే పేరు వింటే చాలు బెంబేలెత్తిపోతున్నారు. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వేల మంది నిరాశ్రయులు అయ్యారు. ఇప్పటికే దాదాపు 40 మంది పైగా వరదల్లో మృతి చెందినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 3 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగినట్లు అంచనా వేశారు. తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి లేఖ కూడా రాసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి పట్టణం అయితే ఏకంగా మూడు రోజుల పాటు వరద నీటిలోనే ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంపై కూడా వరుణుడు ప్రతాపం చూపాడు. భారీ కొండ రాళ్లు విరిగి పడటంతో రెండు ఘాట్ రోడ్లను రెండు రోజుల పాటు అధికారులు మూసివేశారు. ఇక అలిపిరి మెట్ల మార్గం, శ్రీ వారి మెట్ల దారి కూడా వరదలకు దెబ్బ తిన్నాయి.
తిరుపతి పట్టణంలో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 30 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. దీంతో తిరుపతి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. వరద నీరు తగ్గిన తర్వాత కూడా ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణంగా ఇళ్లు కుంగిపోతున్నాయి. గతంలో ఉన్న చెరువు భూములను కబ్జా చేసిన అక్రమార్కులు... వాటిని లే అవుట్లుగా మార్చేసి.. ప్లాట్లు వేసి విక్రయించారు.  ఈ స్థలాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు కూడా నిర్మించారు. అయితే భారీ వర్షాలకు నీరు భూమిలోకి చేరడంతో... నేల మెత్తగా మారిపోయింది. అసలే లోతట్టు ప్రాంతం కావడం, భూమిలో కూడా గట్టిదనం లేకపోవడంతో... భవనాలు కుంగిపోతున్నాయి. తాజాగా శ్రీ కృష్ణ నగర్‌ కాలనీలో మూడు  అంతస్తుల భవనం భూమిలోకి కుంగిపోయింది. దీంతో ఆ భవనాన్ని కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేశారు. కుంగిన భవనం చుట్టుపక్కల ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నఅధికారులు... భవనం చుట్టు పక్కల ఇళ్లను ఖాళీ చేయించారు. భవనాన్ని పూర్తిగా కూల్చివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: