పాపం తెలంగాణ మంత్రులు... ఇంత అవమానమా...!

Podili Ravindranath
తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి... ప్రస్తుతం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది భారతీయ జనతా పార్టీ. అసెంబ్లీలో ఉన్నది ముగ్గురే ఎమ్మెల్యేలు అయినా సరే... రాష్ట్రంలో తామే ప్రధాన ప్రతిపక్షం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కమలం పార్టీ నేతలు. జీహెచ్ఎంసీ వివాదం, ప్రభుత్వంపై ఎదురుదాడి, ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు.... కమలం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో ధాన్యం కొనుగోలు వ్యవహారం ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెద్ద చిచ్చు పెట్టింది. కేంద్రం యాసంగి పంటపై ఆంక్షలు విధించడంతో మోదీ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళలు కూడా చేసింది అధికార పార్టీ. ఇక ధర్నా చౌక్ దగ్గర నిరసన కార్యక్రమంలో అయితే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొన్నారు.
అయితే ఎన్ని వివాదాలు ఉన్నా సరే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ కేంద్ర పెద్దల తీరు మాత్రం అలా లేదు. ప్రస్తుతం ఢిల్లీ పెద్దలను కలిసేందుకు ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా తెలంగాణ మంత్రులకు నిరాశే మిగులుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసినా కూడా.... ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ లభించలేదు. అదే సమయంలో... బద్ద విరోధి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాత్రం... ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అటు రాష్ట్ర మంత్రులు కూడా కేవలం పియూష్ గోయల్‌తో మాత్రమే భేటీ అయ్యారు. ఆయనతో జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో... తెలంగాణ మంత్రులు ఏం చేయలేని దుస్థితిలో ఖాళీ చేతులతోనే  హైదరాబాద్ చేరుకున్నారు. తమకు జరిగిన అవమానంపై ముఖ్యమంత్రికి వివరించారు. ఇక భవిష్యత్తు కార్యాచరణపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్లాన్ ప్రకారం ప్రస్తుతం ముందుకు వెళ్లాలని అంతా భావిస్తున్నారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: