భువనేశ్వరి ఇష్యూ.. టీడీపీ ఇప్పట్లో వదిలేలా లేదుగా..?

Chakravarthi Kalyan
ఏపీ అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు చేశారని చెబుతున్న వ్యాఖ్యలు రాజకీయంగా పెను వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజకీయాలతో సంబంధం లేని తన భార్యను అంతగా ఏకంగా అసెంబ్లీలో అవమానిస్తారా.. అన్న ఆవేదనతో చంద్రబాబు ప్రెస్ మీట్‌లోనే రోదించిన ఘటన రాజకీయంగా కలకలం సృష్టించింది. ఆ తర్వాత.. ఒకదానికి తర్వాత ఒకటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు రోదించడం.. ఆయనకు మద్దతుగా పలువురు ప్రముఖులు స్పందించడం.. నందమూరి కుటుంబం సైతం ఈ వ్యాఖ్యలపై కుటుంబ సమేతంగా స్పందించడం జరిగిపోయాయి.

అయితే.. అసలు నారా భువనేశ్వరిని తామేమీ అనలేదని.. చంద్రబాబు లేని విషయాన్ని పెద్దది చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు మాత్రం ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేలా కనిపించడం లేదు. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. అక్కడ కూడా తన భార్యపై ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. మీ భార్యకో.. చెల్లికో.. కూతురుకో ఇలా జరిగితే సహిస్తారా అంటూ ప్రజలను ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యాఖ్యల వ్యవహారం జరిగి వారం పది రోజులు కావస్తున్నా.. ఇంకా టీడీపీ ఈ ఇష్యూని కొనసాగిస్తూనే ఉంది.

తాజాగా.. టీడీపీ పొలిట్ బ్యూరోలో జరిగిన సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. దీనికి కొనసాగింపుగా  ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం డిసెంబరు ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. అంటే ఈ ఇష్యూను ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదని తెలుగు దేశం పార్టీ సంకేతాలు ఇచ్చినట్టయింది. డిసెంబరు ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో మహిళల ఆత్మ గౌరవ సభలు నిర్వహించాలని తెలుగు దేశం  పొలిట్‌ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు.

ప్రజాస్వామ్య సౌధం లాంటి శాసనసభను వైసీపీ కౌరవ సభగా మార్చిందని.. తద్వారా మహిళల వ్యక్తిత్వంపై దాడి చేసిందని.. ఆ వ్యవహారంపై ప్రజాచైతన్యం కల్పించాలని తెలుగు దేశం భావిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: