దక్షిణాఫ్రికా వేరియంట్‌తో పెనుముప్పు.. ఇండియాకూ గండం..?

Chakravarthi Kalyan
దక్షిణాఫ్రికా వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. ఇది శరవేగంగా వ్యాపిస్తోంది. అంతే కాదు.. చాలా ప్రమాదకరంగా కూడా ఉంది. ఓవైపు హమ్మయ్య ఇక కరోనా ముప్పు తొలగిపోయినట్టేనని కాస్త ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో దక్షిణాఫ్రికాలో తాజాగా బయటపడిన కొత్త వేరియంట్‌ మళ్లీ భయంపుట్టిస్తోంది. ఈ దక్షిణాఫ్రికా వేరియంట్‌ తో ప్రపంచానికి మరోసారి కరోనా ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ కరోనా కొత్త వేరియంట్ భారీ సంఖ్యలో మ్యూుటేషన్లు అవుతోందట. అలాగే పాత వేరియంట్ల కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

ఈ  దక్షిణాఫ్రికా వేరియంట్‌ గురించి ఇప్పుడు ప్రపంచం అంతా హడలిపోతోంది. దీని ప్రభావంపై చర్చించేందుకు నిన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక సలహా బృందం కూడా అత్యవసరంగా సమావేశమైందంటే సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు.. ఈ కొత్త వేరియంట్ ప్రపంచంపై ఆర్థికంగానూ ప్రభావం చూపుతోంది. ఈ  వేరియంట్‌ భయాలతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో మునిగాయి. ఇండియాలో స్టాక్ మార్కెట్లు దాదాపు 7 నెలల కనిష్టానికి పడిపోయాయి.

కరోనా కొత్త వేరియంట్ భయంతో దక్షిణాఫ్రికాకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నాయి. అంతే కాదు.. ఈ కొత్త వేరియంట్‌ గురించి ఇప్పటివరకూ ప్రపంచానికి తెలిసింది తక్కువే. దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ దక్షిణాఫ్రికా వేరియంట్‌కు సంబంధించి ఇప్పటివరకూ వంద కంటే తక్కువ జినోమ్‌ సిక్వెన్స్‌లు చేశారట. ఇంకా పరిశోధన చేస్తే కానీ.. ఈ కొత్త వేరియంట్ పై పూర్తి అవగాహన వస్తుందట.

ఈ కొత్త వేరియంట్ కేసులు దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 100కుపైగా వెలుగు చూశాయి. ఈ వేరియంట్‌తో ఇన్ఫెక్షన్లు, పాజిటివిటీ రేటు కూడా పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ ఇతర దేశాలకు కూడా పాకుతోంది. ఇప్పటికే బోట్స్‌వానా, హాంకాంగ్‌లో ఈ తరహా కేసులు గుర్తించారు. ఇండియాలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్న సమయంలో ఈ వేరియంట్ నుంచి ఇండియాకూ ముప్పు ఉన్నట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: