ఆంధ్ర-తెలంగాణ మధ్య కొత్త వివాదం...!

Podili Ravindranath
తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఎన్నో సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల వ్యవహారం. జల జగడం అయితే కేంద్రం దగ్గర పంచాయితీ కూడా పెట్టాయి. దీనిపై ఇప్పటికే ఎన్నో సార్లు కేంద్ర జల శక్తి శాఖ మంత్రిత్వ శాఖ సమక్షంలో రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారులు చర్చలు జరిపినా... ఆ సమస్య మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇక శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద విద్యుత్ ఉత్పత్తి విషయంలో కూడా రెండు రాష్ట్రాలు తన్నుకుంటూనే ఉన్నాయి. ఇక ఆస్తుల పంపకం, ఉద్యోగుల కేటాయింపు అంశం కూడా రాష్ట్రాల మధ్య తలనొప్పిగా ఉంది. ఇప్పుడు తాజాగా మరో వివాదం రేగింది. అదే తెలంగాణలో హాట్ టాపిక్‌గా ఉన్న ధాన్యం వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ధాన్యం లారీలకు అధికారులు బ్రేక్ కొట్టారు. అసలు తమ రాష్ట్రాంలోకి రావాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు తెలంగాణ రాష్ట్ర అధికారులు. అన్ని అనుమతులు ఉన్నా కూడా ఎందుకు ఆపుతున్నారని అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ధాన్యం యజమానులు.
ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ధాన్యం లారీలను ఎందుకు అడ్డుకుంటున్నారని రైతులు, వ్యాపారులు నిలదీస్తున్నారు ఇప్పుడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధం జరుగుతోంది. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ధర్నాలు కూడా చేస్తోంది. కేంద్రంపై ఒత్తిడి కూడా చేస్తోంది. ఇదే విషయం ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద దుమారం రేపుతోంది కూడా అయితే రైతులు పండించిన ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... రైతుల నుంచి పూర్తిస్థాయిలో తీసుకోవటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికీ కల్లాల్లో ధాన్యం అలాగే ఉందని... వర్షాల కారణంగా ధాన్యం తడిసి... మొలకలు వస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కూడా. ఈ పరిస్థితుల్లో ఏపీ నుంచి వచ్చే ధాన్యాన్ని అడ్డుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: