ఎంపీలతో జగన్ భేటీ... ఆర్ఆర్ఆర్‌ ఎపిసోడ్‌పై కీలక చర్చ..!

Podili Ravindranath
మరో మూడు రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నయి. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ ఎంపీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు సమావేశం కానున్నారు. పార్లమెంట్‌లో కేంద్రంతో వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ ఎంపీలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కేంద్రం తీసుకున్న ఎన్నో కీలక బిల్లులకు వైసీపీ ఎంపీలు సభలో మద్దతు కూడా తెలిపారు. కేంద్రానికి వైసీపీ సహకరిస్తోంది కూడా. అయినా సరే... రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందటం లేదని వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎన్నో విజ్ఞప్తులు అమలుకు నోచుకోలేదు. పార్టీ రెబర్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వేటు వ్యవహారం, నిధుల విడుదల, ప్రత్యేక హోదా, శాసన మండలి రద్దు వంటి ఎన్నో విషయాలపై కేంద్రం వివక్ష చూపుతోంది.
తిరుపతిలో ఈ నెల 14వ తేదీన సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన ఎన్నో కీలక అంశాలను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ముందు ప్రస్తావించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం అయితే కేంద్రం దగ్గర నానుతూనే ఉంది. రుణాల మంజూరు, రెవెన్యూ లోటు భర్తీ వంటి అంశాలపై కేంద్రం పరిశీలిస్తూనే ఉంది. వీటన్నిటికి తోడు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపు వివాదం, ప్రాజెక్టుల అంశాలు కూడా పరిష్కారం కాలేదు. వీటన్నిటిని రాబోయే పార్లమెంట్ శీతాకాలా సమావేశాల్లో ప్రస్తావించాలని పార్టీ ఎంపీలకు జగన్ సూచించనున్నారు. పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వేటు వ్యవహారాన్ని ఈ సమావేశాల్లోనే తేల్చుకునేందుకు కూడా పార్టీ ఎంపీలు సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: