కలవరపెడుతున్న కొత్త కరోనా...!

Podili Ravindranath
కరోనా వైరస్... ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ వైరస్ తొలి కేసు చైనాలో వెలుగు చూసి సరిగ్గా రెండేళ్లు గడిచింది. నెమ్మదిగా ప్రపంచమంతా విస్తరించింది. ఇక గతేడాది మార్చి నెల నుంచి అయితే వైరస్ దెబ్బకు ప్రపంచం స్తంభించిపోయింది. ఎక్కడి వాళ్లు అక్కడే ఆగిపోయారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా రెండు నెలల పాటు ఇళ్లకే పరిమతం అయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా తలకిందులు అయ్యింది. నెమ్మదిగా పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. మరోసారి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. ఓ వైపు వైరస్ కట్టడికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కూడా... కొత్త వేరియంట్లు ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే వంద కోట్ల డోసులు దాటేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు కూడా. మరోవైపు వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కొవిడ్ నిబంధనలు అమలు చేస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా కరోనా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇది ఏకంగా 30 మ్యుటేషన్లతో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కొత్త వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాఫ్రికాలో గుర్తించింది.  ఈ వేరియంట్ ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో విస్తరిస్తున్నట్లు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారుల నివేదిక  వెల్లడిస్తోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు కూడా ఆఫ్రికా దేశాల్లో పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో థర్డ్ వేవ్ వస్తుందని జూన్ నెలలోనే అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఆఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ను థర్డ్  వేవ్‌గా నిపుణులు అనుమానిస్తున్నారు. కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో భారత్ కూడా ముందుగానే అలర్ట్ అయ్యింది. దక్షిణాఫ్రికా సహా... ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ప్రత్యేక దృష్టి సారించింది. ట్రావెల్ హిస్టరీని పరిశీలిస్తున్నారు. ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చిన వారిని వెంటనే గుర్తించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ప్రయాణీకులందరికీ తప్పని సరిగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని అన్ని విమానాశ్రాయల అధికారులను ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: