టార్గెట్ గోవా.. బీజేపీ చీఫ్ నడ్డా పర్యటన...!

Podili Ravindranath
వచ్చే ఏడాది మార్చి నెలలో జరిగే గోవా అసెంబ్లీ ఎన్నకల కోసం భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. గోవాలో తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ మృతితో ప్రస్తుతం కమలం పార్టీకి గోవాలో సరైన నాయకుడు లేకుండా పోయాడు. దీంతో బీజేపీ తిరిగి అధికారంలో వచ్చే బాధ్యతను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా భూజానికి ఎత్తుకున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు గోవాలోని బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన నడ్డా... ఈ రోజు గోవాలో స్వయంగా పర్యటించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సి వ్యూహాలను జేపీ నడ్డా నేతలకు వివరించారు. అదే సమయంలో ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందే వరకు కార్యకర్తలు కృషి చేయాలని జేపీ నడ్డా వివరించారు.
రెండు రోజుల పర్యటన కోసం జేపీ నడ్డా గోవాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని జేపీ నడ్డా కార్యకర్తలకు సూచించారు. పనాజీలోని మహాలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి కార్యకర్త క్షేత్ర స్థాయిలో పర్యటించాలని... ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలని నడ్డా సూచించారు. మోదీ సర్కార్ సూచించిన సబ్ కా సాత్... సబ్ కా వికాస్... సబ్ కా విశ్వాస్... సబ్ కా ప్రయాస్... నినాదానికి కార్యకర్తలంతా కట్టుబడి ఉండాలన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలని జేపీ నడ్డా ఆదేశించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ఇంఛార్జ్‌గా మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను జేపీ నడ్డా నియమించారు. కో ఇన్‌ఛార్జ్‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ దర్శన్ జర్దోష్‌లు వ్యవహరిస్తున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలతో అతి పెద్ద పార్టీగా నిలిచింది. అయితే 13 మంది సభ్యులున్న బీజేపీ మాత్రం... ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి మాత్రం సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గట్టి  పట్టుదలతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: