వరదలు : ప్రతిదీ.. రాజకీయమే..!

Chandrasekhar Reddy
దేశంలో ఎన్నో వస్తువులు లేదా కట్టడాలు ఇంకా ఒకప్పటి బ్రిటిష్ వాళ్ళు కట్టినవే ఉన్న విషయం తెలిసిందే. అవన్నీ న్యాయంగా అయితే ఎప్పటికప్పుడు నాణ్యత ప్రమాణాలు పరిశీలించి దానికి తగ్గట్టుగా ఇక అవి పనికిరావు అన్నవాటిని పక్కన పెట్టేయాలి. కానీ ఎప్పుడూ సరైన నేతలు లేనందున అవన్నీ కొద్దిపాటి నాణ్యత లోపాలు మార్చి ఇంకా వాటినే ఆడిస్తున్న వైనం దాదాపుగా కొన్నాళ్ల వరకు చూస్తూనే ఉన్నాం. అప్పటివి ఇంకా బలంగా ఉండటం, ఇటీవల కట్టినవి కూలిపోవడం చూస్తుంటేనే వాటి నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నది అర్ధం అవుతూనే ఉంటుంది. ఇక ప్రకృతి వైపరీత్యాలు వస్తే, అందులోనూ అసలు నాణ్యత ప్రమాణాలు పట్టని చోట జరిగిన కట్టడాలు ఎలా ప్రభావితం అవుతాయో మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు.
కేవలం వారి స్వార్ధ ప్రయోజనాలకు ఎవరెవరికో ఆయా ప్రాజెక్టులు కట్టబెట్టి వాటి కోసం ఎందరెందరినో బాధపెట్టి, వాళ్ళవాళ్ళ సొంత ప్రాంతాల నుండి వాళ్ళను వెళ్లగొట్టి మరీ ఆయా కట్టడాలు చేపడతారు. కనీసం ఆ నిర్వాసితులను పట్టించుకునే వారు ఉండరు అనేది ఒక్క దేశంలో నే జరుగుతుంది కాబోలు. ఇలాంటి దేశంలో, అది కూడా కనీసం పిడుగులు పడతాయని ముందుగా తెలిపేంత సాంకేతికత ఉన్న చోట కూడా ప్రకృతి వైపరీత్యాల బారిన పడి ఇంకా జనాలు ఇక్కట్లు పడటం ఏమిటో అర్ధమే కాదు. ఒక్కసారైనా తగ్గట్టుగా ప్రజా స్పందన కూడా ఉండబోదు, ఇది మరీ విచిత్రం. ఈ దేశంలో జనాభా ఉన్నది కానీ ప్రజలు లేనట్టుగానే ఉంది. ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు కాసేపు మండిపోవడం తప్ప, మరోసారి గొంతెత్తి తప్పు చేసేవారిని దిద్దటం జరగని దేశంలో ఇంతకంటే సౌక్యమైన పరిస్థితులు కోరుకోవడం జరగనిపని.
రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వారికి ఏదైనా విషయమే, తాజా వరదలు కూడా రాజకీయాలు చేస్తారు తప్ప, తమతమ పార్టీ సైన్యాన్ని ఘటన స్థలానికి పిలిపించి, ప్రజలకు సాయం అందించే యోచన మాత్రం ఎవరికీ రాదేమిటో..? ఆ అధికారి రాలేదు, ఈయన రాలేదు అని ఒకరికొకరు విమర్శించుకోవడం మానేసి, సమస్య ఉన్నచోట పరిష్కారంతో ఉండటం అలవాటైన లేదా అలా అలవాటు చేసుకున్న పార్టీలనే పార్టీలుగా గుర్తించే సంస్కారం ఈ ఎన్నికల సంఘానికి వస్తే బాగుండు. రేపటి రోజున దేశంలో నాణ్యత అనేది ఎక్కడా కూడా కనిపించబోదేమో..! ఇప్పటికే ఏది నకిలీ, ఏది నాణ్యత ఉన్నది అనేది కనుక్కోవడమే మహా కష్టంగా ఉంది. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రజలు కారణం, ప్రజల నిర్లక్ష్యం స్వార్ధ రాజకీయాలను పెంచిపోషిస్తుంది తప్ప, జాలిపడి ప్రజా సేవ చేపించబోదు, ఇది ప్రజలు గుర్తించుకుంటే దేశం బాగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: