కేంద్రాన్ని కుదిపేస్తున్న మరో కీలక బిల్లు...!

Podili Ravindranath
కొత్త వ్యవసాయ చట్టాలపై గట్టి ఎదురు దెబ్బ తగిలింది కేంద్ర ప్రభుత్వానికి. సరిగ్గా ఏడాది క్రితం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై మోదీ సర్కార్ యూ టర్న్ తీసుకుంది. రైతులు ఆందోళనతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 19వ తేదీన సిక్కుల గురువు గురునానక్ జయంతి సందర్భంగా మోదీ కీలక ప్రకటన చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం పరువు పోయినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో కీలక బిల్లు పార్లమెంట్ సమావేశాల్లో కాక రేపనుంది. అదే వ్యక్తిగత సమాచారం రక్షణ బిల్లు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సమాచార గోప్యత విషయంలో కేంద్రం వివక్ష చూపడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ బిల్లు అమలులోకి వస్తే... వ్యక్తిగత సమాచార రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి విశేష అధికారాలు రానున్నాయి.
అయితే దీనిని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు ఆమోదం పొందితే... నియంతృత్వానికి దారి తీసే అవకాశం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే అసమ్మతి నోట్ కూడా పంపాయి విపక్షాలు. దేశంలో పౌరులు, వ్యక్తులు, సంస్థలకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని రక్షించేందుకు తమ ఆందోళన ఉధృతం చేస్తామని ఇప్పటికే విపక్షాలు హెచ్చరించాయి కూడా. ఇందుకు ప్రధాన కారణంగా పెగాసస్ అంశాన్ని ఉదహరిస్తున్న విపక్షాలు. పెగాసస్ వంటి స్పై వేర్ లను ఉపయోగించడం ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని కేంద్రం సేకరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు పెగాసస్ అంశంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో కూడా కేసులు విచారణలో ఉన్నాయి. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని రక్షిస్తామంటున్న కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు సవాల్ విసురుతున్నాయి విపక్షాలు. అయినా సరే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును తీసుకువస్తామని కేంద్రం స్పష్టం చేస్తోంది. కానీ ఇందులో పొందుపరిచిన వివాదాస్పద అంశాలపై మాత్రం కేంద్రం ఎలాంటి వివరాలు చెప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: