ఎమ్మెల్సీ ఎన్నికలపై హుజురాబాద్ ఎఫెక్ట్.. పోటీకి భయపడుతున్నారా..!

MOHAN BABU
మొన్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనే ఓటుకు ఆరు వేల నుంచి పది వేలు ఇచ్చారు,ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఎంపీటీసీగా గెలిచిన కాన్నుంచి పైసా పనిచేయలేదు, పనుల కోసం వెళ్తే ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, మంత్రులు కమిషన్లు అడుగుతున్నారు. ఇప్పుడు మా ఓటుకు కూడా అయిదారు లక్షల ఇవ్వాల్సిందే, లేకుంటే ఓటు వేయద్దనుకుంటున్నాం, మా మండలంలోని ఎంపిటిసిలమంతా కూడా అదే అనుకుంటున్నాం, లేకుంటే ఎమ్మెల్సీగా ఓట్లతో గెలిచి కూడా మాకు ఏమైనా పని చేస్తున్నారా? ఇప్పుడు మేము ఓటుకు ఇంత డిమాండ్ చేయడంలో తప్పేముంది..? ఇది హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కి చెందిన ఓ ప్రజాప్రతినిధి వాదన. ఉప ఎన్నిక అంటే లక్షలకు లక్షలు ఇచ్చి కండువా కప్పారు. ఓటు 10000 పంచారు.అలాంటిది నేను ఎంపీటీసీ ని,ఇప్పుడు నేను ఓటు వేయాలి, ఎంపీటీసీగా గెలిచిన ఏం చేయాలో ఇంతవరకు తెలవలేదు,కానీ ఇప్పుడు మా ఓట్లతోనే ఎమ్మెల్యే అయితారు.నా ఓటుకు కూడా లక్షలకు లక్షలు ఇవ్వాల్సిందే లేకుంటే స్వతంత్ర అభ్యర్థికి అయినా వేస్తా..కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలానికి చెందిన ఓ ఎంపిటిసి వ్యాఖ్యలివి. రాష్ట్రంలో స్థానిక సంస్థల మండలి పోరు మహా ఖరీదుగా మారుతోంది.దీనికి ప్రధాన కారణం కూడా హుజురాబాద్ ఉప ఎన్నికలే.అక్కడి ప్రలోభాలు, పంపకాల తో ఇప్పుడు మండలి లో పరిషత్ సభ్యుల ఓట్లకు బారీ డిమాండ్ పెరిగింది. కొన్ని చోట్ల బహిరంగంగా అమ్మకానికి పెడుతున్నారు. దీంతో మండలి ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే అభ్యర్థులు భయపడుతున్నారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో భాగంగా పరిషత్ సభ్యుల పదవీ కాలం దగ్గర పడింది మరో ఏడాది నుంచి ఏడాదిన్నర గడువు మాత్రమే ఉంది. ఈ సమయంలో వస్తున్న మండలి ఎన్నికల్లో ఆర్థిక ఆశలు పెరుగుతున్నాయి. దీంతో పార్టీ ఏదైనా తమ ఓటును బట్టి  రేటును ఇస్తే అటు వైపు మొగ్గు చూపేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నిక నుంచి తేరుకోకముందే గుక్కతిప్పుకోకుండా నోటిఫికేషన్ రావడంతో బెంబేలెత్తుతున్నారు. ఆ స్థానాలకు డబ్బులు పెట్టే స్తోమత ఉండే అభ్యర్థుల కోసం కూడా అధిష్టానాలు వెతుకుతున్నాయి ప్రస్తుతం స్థానిక ఎన్నికలే ఖరీదుగా మారిన నేపథ్యంలో ఇప్పుడు మండలి ఎన్నికలు సైతం కాస్ట్లీ గా మారాయి. దీంతో ఈ భారం ఎవరు భరిస్తారనే చర్చ మొదలైంది. పార్టీ పరంగా కాకుండా ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఎవరనే అంశాలను పరిగణలోకి తీసుకొని టికెట్ ఇచ్చేందుకు అధికార పార్టీ సైతం లెక్కలు వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: