తగ్గేదే లే అంటున్న ఆర్ఆర్ఆర్..!

Podili Ravindranath
మూడు రాజధానుల బిల్లు నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. 700 రోజులుగా రైతులు చేస్తున్న పోరాటం ఫలించిందని ప్రకటించారు నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజు. ముందు నుంచీ తన మద్దతు అమరావతి రాజధానికే అని ఆర్ఆర్ఆర్ ప్రకటించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తున్న ఆందోళనలకు రఘురామ మద్దతు ప్రకటించారు కూడా. అలాగే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోమ్ మంత్రి సహా ఇతర మంత్రులు, ప్రముఖులను అమరావతి ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన సమయంలో కూడా ఎంపీ రఘురామ వాళ్ల పక్కనే ఉన్నారు. అందరు ప్రముఖుల దగ్గరకు స్వయంగా తీసుకువెళ్లారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఎంపిక చేయడానికి గల కారణాలను కూడా అప్పట్లో రఘురామ వివరించారు కూడా. అయితే ఇప్పుడు 3 రాజధానుల బిల్లును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయంపై అమరావతి రైతులు సాధించిన విజయమన్నారు ఎంపీ రఘురాఘ.
మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వ అనాలోచిత ప్రకటన చేసిందన్నారు రఘురామ. అయితే ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం 2 రాజధానులనే మాట ఎత్తుతుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవద్దని సూచించారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇప్పటికే కేంద్రం గుర్తించిన, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శంఖుస్థాపన చేసిన అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలోనే జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు ఎంపీ రఘురామ. తిరుపతిలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యటన తర్వాతే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు రఘురామ కృష్ణంరాజు. మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు మాత్రం తమ యాత్రను కొనసాగించాలన్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఇప్పటికే అమరావతి జేఏసీ ప్రకటించింది కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: