సందడి లేకుండా చప్పగా సాగిపోతున్న నెల్లూరు రాజకీయాలు..

Deekshitha Reddy
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలు గందరగోళంగా మారిన విషయం తెలిసిందే. పలు డివిజన్లలో వైసీపీ ఏకగ్రీవాలపై టీడీపీ నేతల ఆందోళనలు, నిరసనలతో నెల్లూరు నగరం దద్దరిల్లింది. పోలీసులతో వాగ్వాదాలు, గొడవల మధ్యనే పోలింగ్ కూడా జరిగింది. అయితే కౌంటింగ్ మాత్రం గొడవలు లేకుండా ప్రశాంతంగానే జరిగింది. 8 ఏకగ్రీవాలు, పోలింగ్ జరిగిన 46 డివిజన్లతో కలిపి.. మొత్తంగా 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకోగా, టీడీపీ శ్రేణులు సైలెంట్ అయ్యాయి. 54 సీట్లు వైసీపీ గెలుచుకోవడంతో వైసీపీ హంగామా మామూలుగా ఉండదని అందరూ భావించారు. భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తారని కూడా అంతా భావించారు.
అయితే నెల్లూరు కార్పొరేషన్ లో మాత్రం అస్సలు సందడి కనిపించడం లేదు. ప్రతిపక్షమే లేకపోయేసరికి వైసీపీ నేతల్లోనూ ఉత్సాహం తగ్గిపోయింది. పోటీ లేకుండా పోవడంతో కార్పొరేషన్ సమావేశాలు కూడా చప్పగా సాగిపోనున్నాయి. కనీసం మేయర్ ఎన్నికప్పుడయినా కాస్తో కూస్తో హడావిడి ఉంటుందనుకుంటే ఆ ముచ్చటా తీరేలా కనిపించడం లేదు. అంతా ప్రశాంతంగా ముగిసిపోతోంది. ఎందుకంటే మేయర్ గా పొట్లూరి స్రవంతి ఏకగ్రీవం అయింది. కనీసం మేయర్ ఎన్నికల్లో అయినా, సిటీ, రూరల్ మధ్య ఆధిపత్య పోరు ఉంటుందని ఊహించినా అదీ లేదు. దీంతో నెల్లూరులో అంతా ప్రశాంతంగా ఉంది.
అయితే కార్పొరేషన్ ఎన్నికలలో ఊహించని ట్విస్ట్ ఒకటి బయటకొచ్చింది. మేయర్ స్థానం సిటీ నియోజకవర్గానికి కేటాయించాలని మొదట నుంచి అనుకున్నారు. అందుకు అనుగుణంగానే మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ ప్రణాళికలు సిద్ధం చేశారు. అభ్యర్థుల ప్రకటన కూడా మేయర్ సీటు కోసమే ఆచితూచి నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో ఏమైందో ఏమోగానీ అనూహ్యంగా మేయర్ స్థానం నెల్లూరు రూరల్ నియోజకవర్గం చేతికి వచ్చింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గానికి చెందిన స్రవంతికి మేయర్ స్థానం దక్కింది. నెల్లూరు కార్పొరేషన్ మొత్తం సిటీ, వైసీపీ నియోజకవర్గాలతో ముడిపడి ఉండటంతో జిల్లా వైసీపీ నేతల దృష్టి మొత్తం మేయర్ సీటు చుట్టూ తిరిగింది. తాజాగా మేయర్ ఎన్నికతో ఈ వివాదానికి తెర పడింది. గతంలో నెల్లూరులో అధికార వైసీపీలో కొంతమంది నాయకులు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు కానీ.. కార్పొరేషన్ ఎన్నికలనాటికి అందరూ కలసిపోయారు. 54 సీట్లు మొత్తం వైసీపీ గెలుచుకోవడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: