రాజస్థాన్‌లో కొత్త మంత్రివర్గం.. పైలెట్ వర్గానికి ఛాన్స్...‍‍‍!

Podili Ravindranath
కాంగ్రెస్ పార్టీ కోటలో మిగిలిన రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. ప్రస్తుతం సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజస్థాన్ రాష్ట్రంలో సీనియర్, జూనియర్ అనే బేధాలు కొనసాగుతున్నాయి. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య ఒక దశలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నది కూడా. తన వర్గం ఎమ్మెల్యేలతో సచిన్ పైలెట్ ప్రత్యేకంగా సమావేశం కూడా అయ్యారు. దీంతో అక్కడి రాజకీయ పరిణామాలపై అధిష్ఠానం నేరుగా దృష్టి సారించింది. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ జరిపించాలని... అందులో సచిన్ వర్గానికి పెద్ద పీట వేయాలని కూడా సోనియా ఆదేశించారు. ఇక అధినేత ఆదేశాలతో మంత్రివర్గ విస్తరణ చేపట్టారు అశోక్ గెహ్లాట్.
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాజస్థాన్ రాజ్ భవన్‌లో కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే గోవింద సింగ్ డోస్తారా, రఘు శర్మ, హరీశ్ చౌదరీలు తమ పదవులకు రాజీనామా కూడా చేశారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత సోనియాకు లేఖ ద్వారా వెల్లడించారు. దీంతో కొత్త మంత్రులుగా ఈ ముగ్గురికి అవకాశం ఉండనుంది. సచిన్ వర్గానికి చెందిన ఈ ముగ్గురికి క్యాబినెట్‌లో మెజారిట్టీ పోర్టు పోలియోలు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా గోవింద్ సింగ్ దోస్తారా కొనసాగుతున్నారు. ఒకరికి ఒకటే పదవి అనేది ప్రస్తుతం రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. కొత్త మంత్రివర్గంలో దాదాపు 12 మంది సచిన్ పైలెట్ వర్గానికి చెందిన నేతలు ఉండే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. గతంలో గెహ్లాట్‌తో విబేధించిందిన సచిన్ పైలెట్... ప్రభుత్వం పాలనపై విమర్శలు గుప్పించారు. సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడంతో... ఈ విషయాన్నీ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు సీఎం అశోక్ గెహ్లాట్. దీంతో పైలెట్‌ను బుజ్జగించేందుకు రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. మొదటి నుంచి రాహుల్ కోటరిగా పైలెట్‌ పైన ముద్ర ఉంది. రాహుల్ రాజీ ప్రయత్నాలు ఫలించడంతో... అప్పట్లో పైలెట్ కాస్త మెత్తబడ్డారు. ఇప్పుడు తన వర్గానికి మెజారిటీ స్థానాలు రావడంపై సచిన్ పైలెట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: