కంచుకోట‌లో వైసీపీ ప‌ట్టు కోల్పోతోందా... ఫ్యాన్ సీన్ రివ‌ర్స్‌...!

VUYYURU SUBHASH
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ప‌ట్టున్న అనంత‌పురం జిల్లాలో 2019లో వైసీపీ రెండు అసెంబ్లీ స్థానాలు మిన‌హా.. మిగిలిన అన్ని స్థానాల‌నుక్లీన్ స్వీప్ చేసింది. రెండు ఎంపీ స్థానాల‌ను కూడా ద‌క్కించుకుంది. దీంతో ఇక‌, టీడీపీ ప‌రిస్థితి అయిపోయింద‌ని అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ పార్టీ పుంజుకునే ప‌రిస్థితికి చేరింది. అంతేకాదు.. ఒకింత శ్ర‌మిస్తే.. టీడీపీకి పున‌ర్వైభ‌వం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇక‌, వైసీపీని చూస్తే.. గ‌త ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీ ద‌క్కించుకున్నా.. నేత‌ల మ‌ధ్య‌ ఆధిప‌త్య పోరు.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం.. వ్య‌క్తిగ‌త అజెండాలు అమ‌లు చేసుకోవ‌డం వంటివి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి.

దీంతోతాజాగా జ‌రిగిన ప‌రిష‌త్ పోరులో.. వైసీపీ ప‌ట్టుతప్పుతున్న ప‌రిస్థితి క‌నిపించింది. ప్ర‌జ‌ల మూడ్ కూడా మారింది. ఓటు బ్యాంకు.. మ‌ళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతోంది. ఇది అధికార పార్టీలో అంత‌ర్మ థ‌నానికి దారితీయ‌గా.. ప్ర‌తిప‌క్షంలో ఆనందానికి దారితీసింది. జిల్లాలో 16 ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎంపీటీసీ స్థానాల పరిధిలో మొత్తం 42,262 మంది ఓటర్లున్నారు. వీరిలో 31,608 మంది ఓటర్లు ఓటేశారు. మొత్తం 74.79 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇక‌, ఇక్క‌డి 16 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు 15,629 ఓట్లు వచ్చాయి. అంటే పోలైన ఓట్లలో 49.44 శాతం ఈ పార్టీకి ఓట్లు వ‌చ్చాయి.

ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీని చూస్తే..  16 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 14,494 ఓట్లు ఈ పార్టీ అభ్య‌ర్థుల‌కు వచ్చాయి. అంటే  45.85 శాతం మంది ఓటర్లు టీడీపీకి ఓటేశారు. ఈ లెక్కన అటు వైసీపీ, ఇటు టీడీపీకి మధ్య వచ్చిన ఓట్ల తేడా 1,135 ఓట్లు మాత్రమే. ఇది 3.59 శాతంగానే ఉంది. అత్యంత కీల‌క‌మైన‌.. పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో 20 వార్డులకు గాను అధికార పార్టీకి అత్యధికంగా 18 వార్డులు ద‌క్కినా.. ఓటింగ్ మాత్రం ఆశాజ‌న‌కంగా క‌నిపించ‌లేదు. ఇక్క‌డ టీడీపీకి 6099 ఓట్లు వచ్చాయి.

మ‌రో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం హిందూపురంలోని చిలమత్తూరు జడ్పీ టీసీ స్థానం వైసీపీ ఖాతాలోకే వెళ్లింది. ఆ జడ్పీటీసీ స్థానం పరిధిలో మొత్తం 41441 మంది ఓటర్లున్నారు. వీరిలో 25299 మంది ఓటర్లు ఓటు హక్కును విని యోగించుకున్నారు. ఓట్ల లెక్కింపులో భాగంగా... వైసీపీ అభ్యర్థి గొల్ల అనూషకు 12952 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి లీలావతికి 9988 ఓట్లు వచ్చాయి. 2964 ఓట్ల ఆదిక్యంతో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. కాగా... పోలైన ఓట్లతో పోలిస్తే  వైసీపీ అభ్యర్థికి 51.19 శాతం ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి 39.47 శాతం ఓట్లు దక్కాయి.  సో.. ఈ ప‌రిణామాల‌ను విశ్లేషిస్తే.. అనంత‌పై గ‌త ఎన్నిక‌ల్లో ఉన్న ప‌ట్టు వైసీపీ కోల్పోతోంద‌నే అంచ‌నాలు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: