ఎందుకు ఈ తెలంగాణ- ఎవరికోసం ఈ తెలంగాణ..!

MOHAN BABU
తెరాస పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఉద్యమ కాలమంతా పనిచేసి ఎన్నో త్యాగాలకు పాల్పడిన వారిలో ఈటల రాజేందర్ లాంటి వాళ్లు ఎందరో పార్టీకి దూరమయ్యారు. నాయకత్వ ఆధిపత్యాన్ని సహించక, కార్యకర్తల ఎదుగుదలను సహించని ప్రభుత్వం కారణం ఏదైనా ఉద్యమకారులు మాత్రం తెరాస బయటే ఉన్నారు. పదవులు, ప్రయోజనాలు పొందకుండా ప్రేక్షకులుగా మిగిలిపోవడం అత్యంత విచారకరం మాత్రమే కాదు. తెలంగాణ  ఉనికికే ప్రమాదకరం.
    వేరు వేరు సంస్థల్లో:

  తెలంగాణ ఏకైక లక్ష్యంతో పని చేసి ఎన్నో కేసులను అనుభవించిన డాక్టర్ చెరుకు సుధాకర్ ఇంటి పార్టీ పేరుతో కొనసాగుతున్నారు. ఇక అనేకమంది ఉద్యమకారులు ఇటీవల "తెలంగాణ ఆకాంక్షల వేదిక" అనే పేరుతో ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తున్నారు.
 ఉద్యమ కాలం అంతా తెలంగాణ జేఏసీకి అధ్యక్షుడిగా కొనసాగి జనాన్ని కదిలించిన ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వ విధానాలు నచ్చక" తెలంగాణ జన సమితి" పేరుతో పార్టీని స్థాపించి కొనసాగుతున్నారు. అనేకమంది చనిపోగా ఉన్నవారు కళాబృందాలు, కవులు, రచయితలు, కళాకారులుగా సమైక్య ఉద్యమాన్ని నిర్మించలేక తెలంగాణ స్థితిగతులను చూసి ఆందోళన చెందుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ఉంటేనే బాగుండేది అనే నిరాశావాదం లో కొట్టుమిట్టాడుతున్నారు.
     తెలంగాణ ఏర్పడితే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని, పేదరికం నిర్మూలించబడుతుందని, రైతులు ఇతర కార్మికుల ఆత్మహత్యలు ఆకలిచావులు లేకుండా ఉంటుందని ఆశయంతో నమ్మి పోరాటం చేసిన ఉద్యోగులు, కార్మికులు, రైతులు, సబ్బండ వర్గాలు నిరాశతో చితికి పోతున్నారు. ఇటీవలి కాలంలో అప్పులపాలై రైతులు కార్మికులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకోగా ఇక ఉద్యోగాలు రావో ఏమోననే నిర్వేదంతో విద్యావంతులు, మేధావులు, పరిశోధక విద్యార్థులు ఎందరో ఆత్మహత్యల పాలైనారు.
 
బంగారు తెలంగాణను ఆశ గా చూపి:
   బంగారు తెలంగాణ ఏర్పాటు చేసే క్రమంలో అంటూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజానీకాన్ని మరచి ఉన్నత వర్గాలకు మాత్రమే ఉపయోగపడే పనులు చేయడం స్పష్టంగా కనపడుతున్నది. అంతే కాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను పక్కనపెట్టి వ్యక్తిగత ప్రయోజనాలు రాజకీయలబ్ధి లోనూ ఉన్నత వర్గాలకే మేలు చేస్తున్న సందర్భం. పార్టీని, మంత్రివర్గాన్ని, శాసన సభను, శాసనమండలిని ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతుంది.
    అర్హత లేనివారికి అధికారం కట్టబెట్టి ఉద్యమకారులను, పోరాటం చేసిన వారిని మరిచి, కాలదన్ని, బహిష్కరించి, మనోవేదనకు గురి చేసి అక్రమ దందా లకు పాల్పడేవారి తోనే ఇవాళ ప్రభుత్వం నడవడం అత్యంత విచారకరం. ఎందుకు ఈ తెలంగాణ.? ఎవరి కోసం ఈ తెలంగాణ..?. భౌతికంగా రాష్ట్రం ఏర్పడింది కానీ ఉమ్మడి రాష్ట్రంలోని కంటే దోపిడీ, పీడన, వంచన , ఆత్మగౌరవానికి భంగం జరగడం, పెద్ద వాళ్ళకి పీటలు వేయడం కళ్ళారా చూస్తున్నాం.
 అందుకే కోరుకున్న తెలంగాణ ఆచరణలో అమలు కానప్పుడు లక్షలాది కోట్ల రూపాయలను అప్పుచేసి రైతుబంధు వంటి పథకాలతో ఉన్నత వర్గాలకు మాత్రమే మేలు చేస్తున్న ఈ ప్రభుత్వం మనుగడ ను ప్రతిపక్షాలు ఉమ్మడిగా ప్రశ్నించకపోతే తెలంగాణ అమరుల ఉసురు మనందరికీ తగులుతుంది. నేరం చేస్తున్న వారితో సహా నేరాన్ని ప్రశ్నించకపోతే మనం కూడా నేరస్తులమే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: