తెలంగానం : కాల్మొక్కద్దు కలెక్టర్ !

RATNA KISHORE


రాజ‌కీయం ఎలా ఉన్నా కూడా అది రాజ‌కీయ‌మే! అన‌గా అదొక బుర‌ద గుంట అనుకుంటే బుర‌ద లేదూ మంచి నీళ్ల స‌రస్సు అను కుంటే మంచినీటి స‌ర‌స్సే..అలాంటి రంగంలోకి దూక‌డం సాహ‌సం. అలాంటి రంగంలోకి అత్యున్నత స్థాయిలో ఉద్యోగులుగా ప‌నిచే సి, ఉన్న‌ప‌ళాన ఉద్యోగ జీవితాల‌కు  గుడ్ బై చెప్పి రావ‌డం నిజంగానే హాస్యాస్ప‌దం. వ‌చ్చేక వీళ్లు సాధించింది ఏమీ లేదు. ఇక్క‌డ రాజ‌కీయంలో రాణించింది కేజ్రీవాల్ ఒక్క‌డే. ఆయ‌న గతంలోబ్యూరోక్రాట్ గా ప‌నిచేశారు. ఇండియన్ రెవెన్యూ స‌ర్వీసెస్ లో ప‌నిచే శారు. ఆయ‌న భార్య కూడా బ్యూరోక్రాటే! ఆమె పేరు సునీత. వీరిద్ద‌రూ మిన‌హాయిస్తే ఇటుగా వ‌చ్చి సాహసించి ప‌నిచేసి సాధించిన వారే అరుదు!



తెలంగాణ‌లో మ‌రో ఉన్న‌తాధికారి యూనియ‌న్ స‌ర్వీసుల‌కు చెందిన అధికారి త‌న ఉద్యోగ జీవితం వ‌దులుకుని ఇటుగా వ‌చ్చేశారు. ఇటుగా అంటే రాజకీయ రంగంలోకి! ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపు మేర‌కు ఆయన ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో  తెలంగాణ వ్యాప్తంగా ఇదే విష‌య‌మై చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఉమ్మ‌డి రాష్ట్రంలో ప‌నిచేసిన సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, తెలంగాణ కు చెందిన ఉన్న‌తాధికారి ఆర్ ఎస్ ప్ర‌వీణ్ త‌మ ఉద్యోగ జీవితాలు వ‌ద్ద‌నుకుని రాజ‌కీయ రంగంవైపు అడుగులు వేశారు.



జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ జ‌న‌సేన త‌ర‌ఫున ప‌నిచేసి, విశాఖ‌లో (2019 ఎన్నిక‌ల్లో) ఎంపీగా పోటీచేసి త‌రువాత అనూహ్య రీతిలో త‌ప్పుకున్నారు. ఇప్పుడు సంప్ర‌దాయ వ్య‌వ‌సాయం చేసుకుంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఇక ఆర్ ఎస్ ప్ర‌వీణ్ అనే ఐపీఎస్ అధికారి బీఎస్పీ లో చేరి న‌యా బ‌హుజ‌న వాదం వినిపిస్తున్నారు. విద్య ఆరోగ్యం ఆర్థికం అనే అంశాల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకుని రాజ‌కీయ ప‌రిణామాల‌పై అవి ఏ విధంగా ప్ర‌భావితం చేస్తాయి సామాజిక స్థితిగ‌తుల‌ను అవి ఏ విధంగా మారుస్తాయి అన్న విష‌య‌మై ఆయ‌న అదే ప‌నిగా ప‌నిచేసేందుకు సిద్ధం అవుతున్నారు. వాస్త‌వానికి ఈయ‌న కూడా కేసీఆర్ సూచ‌న మేరకే ఉద్యోగ జీవితానికి రాజీనామా చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. కానీ అవేవీ నిజం కాద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తేల్చేశారు. అయితే ఆయ‌న మాట‌లు ఎలా ఉన్నా ఇప్ప‌టికిప్పుడు బీఎస్పీ త‌ర‌ఫున ఆయ‌న ఒడ్డెక్కేందుకు ఛాన్స్ లేనేలేదు.  సుదీర్ఘ కాలం రాజ‌కీయ రంగంలో ఇమ‌డ‌గ‌లిగే నైజం ఆయ‌నలో ఉందో లేదో అన్న‌ది కాల‌మే తేల్చాలిక!



ఇక సిద్ధిపేట క‌లెక్టర్ వెంక‌ట్రామి రెడ్డి ఇటీవ‌లే కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి రైతుల ఆగ్ర‌హం చ‌వి చూశారు అన్న‌ది అంద‌రికీ తెలిసిందే! అయితే ఆయ‌న  కూడా అటు కేసీఆర్ కు ఇటు కేటీఆర్ కు మంచి దోస్తు. అధికార వ‌ర్గాలు చెబుతున్న మాట ప్రకారం ఆయ‌న‌కో ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి మంత్రి వ‌ర్గంలో తీసుకోవాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న. అదేవిధంగా ప‌రిణామాలు కూడా వేగం వేగంగానే జ‌రుగుతున్నాయి. ఆయ‌న ఇప్ప‌టికే ఎమ్మెల్సీ ప‌ద‌వికి నామినేష‌న్ కూడా వేశారు.ఇవ‌న్నీ ఎలా ఉన్నా కూడా నిన్న‌టి వేళ కేసీఆర్ కాళ్ల‌పై ఆయ‌న మోక‌రిల్ల‌డం మాత్రం అత్యంత ఆశ్చ‌ర్య‌క‌రం. ఓ క‌లెక్ట‌ర్ హోదాలో ప‌నిచేసి, దేశానికే గ‌ర్వ‌కారణంగా నిలిచేందుకు అవ‌కాశం ఉన్న ఉద్యోగం వ‌దిలి రాజ‌కీయంలోకి వ‌చ్చిన ఆయ‌న ఇలా కేసీఆర్ కు పాదాక్రాంతం కావ‌డం మాత్రం ఆక్షేప‌ణీయం. అభ్యంత‌ర‌క‌రం. మ‌రోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా వెంకట్రామిరెడ్డి అవినీతి ప‌రుడు అని ఆరోప‌ణ‌లు చేస్తూ ఆయ‌న పై మాట‌ల‌తో దండెత్తారు. ఆయ‌న నామినేష‌న్ ను తిర‌స్క‌రిస్తే తానెంతో సంతోషిస్తాను అన్న ధోర‌ణిలో మాట్లాడారు. ఇక ముందున్న కాలంలో ఏం జ‌ర‌గ‌నుందో!

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి



మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: