బీసీలపై కాంగ్రెస్ కన్ను.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా..?

MOHAN BABU
 బీసీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన వస్తున్న నేపథ్యంలో, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దళిత బందును ప్రకటించినప్పుడు తమకు కూడా బీసీ బంధు కావాలని పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించిన బీసీ సమాజాన్ని అనేక రాజకీయ పార్టీలు గమనిస్తున్న ట్లుగా తెలుస్తున్నది. నవంబర్ ఒకటి సోమవారం నాడు డి సి సి ల అధ్యక్షులతో సమావేశమైన ప్రదేశ్ కాంగ్రెస్  ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కి 2023 లో రానున్న ఎన్నికల సందర్భంగా బీసీ వర్గాలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించడం పట్ల బీసీ సంఘాలు  అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని గత ప్రభుత్వం బీసీ వర్గాలతో అనేకసార్లు సమావేశాలు జరిపి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి నప్పటికీ ఆ తర్వాత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం బీసీల ఐక్యత సరిగా లేదనే నిర్ధారణకు రాక తప్పదు.

 అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ అధికారం యావత్తు ఉన్నత వర్గాల చేతుల్లోనే కొనసాగుతున్నది. రాజకీయ పార్టీల యొక్క అధ్యక్షులు కూడా ఉన్నత వర్గాలకు చెందినవారే కావడం బిసి అట్టడుగు వర్గాల వారు కేవలము జెండాలు మోసే కార్యకర్తలుగానే మిగిలిపోవడాన్ని బీసీలు సీరియస్ గా తీసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘాల బాద్యులు అవకాశవాద రాజకీయాలకు పాల్పడటంతో ప్రభుత్వం బీసీల చైతన్యాన్ని, శక్తిని చిన్నచూపు చూస్తున్నది .దానికితోడు ఇటీవల హుజురాబాద్లో  జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా కూడా బీసీల ఓట్లు తెరాస పార్టీ కి వేయాలని ఆర్ కృష్ణయ్య పిలుపు ఇవ్వడం కూడా బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు అని సమాజం గుర్తించాలి.
      ఇక మధుయాష్కీ ప్రకటనలో వాస్తవం ఎంత? వచ్చే ఎన్నికల్లో 50 శాతం బీసీలకు కేటాయించడం పార్టీ అంగీకరిస్తుందా? పార్టీ అధినాయకత్వం సామాజిక వర్గం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా బీసీ వర్గాలు నిరంతరం డిమాండ్ చేస్తే తప్ప మధుయాష్కీ ప్రకటన ఆచరణ సాధ్యం కాదు. ఒకవేళ ఆ మాటకు మధుయాష్కీ కట్టుబడి ఉంటే మెజారిటీగా 50 శాతం సీట్లను బీసీలకు కేటాయిస్తే ఆహ్వానించదగిన దే. ఆ స్థాయిలో బిసి వర్గాల నుండి కూడా రాజకీయ చైతన్యాన్ని పెంచుకొని సంసిద్ధంగా ఉండవలసిన అవసరం కూడా  ఉన్నది. ఈమాట 2023 ఎన్నికల్లో చెల్లుబాటు కాకపోతే ప్రచార కమిటీ అధ్యక్షుడిగా మధుయాష్కి ప్రజాకోర్టులో నిలబడక తప్పదు. ఇంత అనుమానం ఎందుకంటే అనాదిగా రాజకీయాలను ప్రభుత్వాలను రాజకీయ పార్టీలను శాసిస్తున్న దంతా కూడా ఉన్నత వర్గాలే. కనుక బీసీలు మిగతా వర్గాలు చట్టసభల్లో సభ్యులు కాలేకపోయారు. రాజ్యాధికారానికి దూరంగా మిగిలిపోయారు.
   మిగతా రాజకీయ పార్టీల సంగతి ఏమిటి?
 
     కాంగ్రెస్ పార్టీ ప్రకటన చూసిన తర్వాత నైనా రాష్ట్రంలోని అలాగే ఇతర రాష్ట్రాలలోని మిగతా పార్టీలు 50 శాతం సీట్లను బీసీలకు కేటాయించడానికి సంసిద్ధత ప్రకటించాలి .ఆ పరంగా స్పష్టమైన టువంటి హామీ ఇవ్వాల్సి నటువంటి అవసరం పార్టీ అధినేత ల పైన ఉన్నది. అన్ని పార్టీలు కేటాయిస్తే నే బీసీ వర్గాలు చట్టసభల్లో కాలు పెట్టే అవకాశం ఉంటుంది. తద్వారా మెజారిటీ సామాజికవర్గానికి రాజ్యాంగ పరంగా లభించవలసిన భరోసా అందినట్లు అవుతుంది.
    ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో సుమారుగా పది మంది బీసీ శాసనసభ్యులు ఉంటే అందులో మంత్రులు ముగ్గురు మాత్రమే. ఆ ముగ్గురిలో ఇటీవలే ఈటెల రాజేందర్ బహిష్కరించబడిన కారణంగా ప్రస్తుతం క్యాబినెట్ లో ఇద్దరు మాత్రమే బీసీ మంత్రులు ఉండటం ఎలా న్యాయసమ్మతం అవుతుందో మిగతా సామాజిక వర్గాలు దయచేసి ఆలోచించవలసిన అవసరం  ఉన్నది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు అనే నిబంధన ఒకవైపు ఉంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా ఉన్నత వర్గాల లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కల్పించి అమలు చేస్తున్నది .అంటే దాని వెనుక కేంద్ర ప్రభుత్వ పట్టుదలే కారణం అని చెప్పక తప్పదు.


       బీసీ వర్గాలు ఎక్కడికక్కడ నిలదీయాలి:
    ఈ రిజర్వేషన్ అంశం కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ బీసీలకు తమ జనాభా దామాషా ప్రాతినిధ్యం లభించేలా చూడవలసిందే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన 50 శాతం సీట్లను బీసీలకు ఇస్తామని ప్రకటించడం భారతదేశ వ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలకు రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలి. ఎక్కడికక్కడ బీసీ వర్గాలు స్థానిక ఎన్నికల నుండి పార్లమెంటు వరకు కూడా 50 శాతం సీట్లు కేటాయించే విధంగా ఒత్తిడి తేవాలి. నిరసన ప్రదర్శనలు నిర్వహించాలి. చివరికి ఓటు అనే అస్త్రాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకొని తన శక్తిని ప్రదర్శించాలి. ఇది కేవలం ఒక వర్గం మీద అక్కసుతో చేస్తున్న డిమాండ్ కాదు. మిగతా సామాజికవర్గాల లాగే అనాదిగా రాజకీయ, విద్య ,ఆర్థిక రంగంలో ఎదిగిన టువంటి ఉన్నత వర్గాల తో పాటు తమ వాటా తమకు దక్కాలనే నినాదం మాత్రమే ప్రజలను ,బీసీలను ఈ వైపుగా కదిలిస్తుంది .ఈ అభిప్రాయాన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విజ్ఞతతో సందర్భోచితంగా గమనిస్తే మధుయాష్కీ ప్రకటన ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కూడా  అమలు కావడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యమాల ద్వారానే చట్టాలను సాధించగలం. రాజ్యాంగ పరంగా అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ పోరాటాలు లేకుంటే అట్టడుగు వర్గాలకు న్యాయం  దక్కదు.బలమైన చట్టాలు రాజ్యాధికారాన్ని నిలబెడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: