కేసీఆర్ Vs ఈటల : బండి సంజయ్ కు అమిత్ షా ఫోన్..! ఏం మాట్లాడారంటే..!

NAGARJUNA NAKKA
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల ఫలితాలపై అభినందనలు తెలిపారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వల్లే బీజేపీ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలు కాషాయ శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి.
అంతకుముందు మీడియాతో మాట్లాడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మడం లేదన్నారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల సరళి ఇందుకు నిదర్శంగా చెప్పారు. దళిత బంధు ప్రకటించినా.. ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మలేదన్నారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నట్టు పేర్కొన్నారు. ఈటల గెలుపు బీజేపీ గెలుపు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈటల రాజేందర్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తుండటంతో.. తమదే విజయం అని బీజేపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. బాణాసంచా కాల్చుతూ.. మిఠాయిలు పంచుకుంటూ.. డ్యాన్సులు చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ ఓటమి దిశగా వెళ్తుండటంతో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్  బోసిపోయింది. కార్యకర్తలెవరూ లేకపోవడంతో అక్కడంతా నిశ్శబ్ధ వాతావరణం ఉంది.  
ఇక ఈటల రాజేందర్ గెలుపునకు సంబంధించి సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన పోస్టులను బీజేపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. కేసీఆర్ గతంలో చెప్పిన ఈటల రాజేందర్ గెలుస్తావున్నడు.. అనే ఎడిటెడ్ వీడియోను ఈటల ప్రస్తుత ఆధిక్యానికి అన్వయిస్తూ వాట్సాప్ స్టేటస్ లుగా పెట్టుకుంటున్నారు.
మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ సత్తా చాటారు. టీఆర్ఎస్ లీడర్ల సొంత గ్రామాల్లోనూ ఆధి్యం కనబరుస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు సొంతూరు హిమ్మత్ నగర్, సీనియర్ లీడర్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్వగ్రామం సింగపూర్, హరీశ్ రావు దత్తత గ్రామం మామిడి పల్లిలో బీజేపీకి లీడ్ వచ్చింది. దళిత బంధు ప్రారంభించిన శాలపల్లిలోనూ ఓటర్లు కమలం పార్టీనే ఆదరించారు. దీంతో బీజేపీలో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: