పట్టాభిని చంద్రబాబు చంపేస్తాడు, అందుకే పారిపోయాడు: విజయసాయి రెడ్డి

Sahithya
టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేడు సంచలన విమర్శలు చేసారు. ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాలకోసమా? స్వప్రయోజనాల కోసమా? అని ప్రశ్నించారు. తనతప్పును కప్పి పుచ్చుకోవడానికి ఢిల్లీ వచ్చాడా? రాష్ట్ర పరువును జాతీయ స్థాయిలో తీయటానికి వచ్చాడా? అన్ని ఆయన మండిపడ్డారు. 2019 నుండి ఇప్పటిదాకా ఒక్క ఎన్నికల్లో గెలవని పార్టీ కేవలం టీడీపీ మాత్రమే అని అన్నారు ఆయన. వ్యవస్థలను మేనేజ్ చేయడానికి వచ్చాడా? తన పార్టీ అధికార ప్రతినిధి వాడిన పదజాలాన్ని రాష్ట్రపతికి వివరించడానికి వచ్చాడా? అంటూ తీవ్ర కామెంట్స్ చేసారు.
అమిత్ షా కాన్వాయ్ పై తిరుపతిలో రాళ్లు వేసిన సీడీని, గతంలో ప్రధానిని వ్యక్తిగతంగా దూషించిన వీడియోల సీడీని రాష్ట్రపతికి ఇచ్చాడా? అంటూ ప్రశ్నించారు. గతంలో 356 ఆర్టికల్ ను తొలగించాలని పార్టీ సమావేశాల్లో తీర్మానం చేసిన చంద్రబాబు ఇప్పుడు దాన్ని రాష్ట్రంలో వినియోగించమని అడగడం సమంజసం కాదు అని ఆయన హితవు పలికారు. ప్రజలచేత ఎన్నుకోబడిన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై అసభ్యపదజాలం వాడ కూడదని చంద్రబాబు కు తెలియదా?  అని ప్రశ్నల వర్షం కురిపించారు.
2014 నుండి 2019 మధ్యకాలంలో గంజాయి అమ్మకాల విషయంలో అప్పుడు ఆయన మంత్రివర్గంలో ఉన్న వారు ఆరోపణలు చేసుకున్న విషయం నిజం కాదా? గంజాయి అమ్మకాల్లో లోకేష్ కు భాగస్వామ్యం, వాటా ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం కాదా?  అని నిలదీశారు. అసాంఘిక శక్తులను ప్రోత్సాహించే విధంగా చంద్రబాబు వ్వవహరిస్తున్నారు అని ఆయన విమర్శించారు. భాధ్యతాయుతమైన ప్రతిపక్ష పదవిలో ఉన్న చంద్రబాబు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదు అన్నారు విజయసాయి. రాష్ట్రంలో నిత్యం అశాంతియుతమైన పరిస్థితులు సృష్టిస్తూ అరాచక పరిస్థితులకు ఆజ్యంపోస్తున్నారు అని మండిపడ్డారు.
చంద్రబాబు నైజం తెలిసే వివిధ రాజకీయపార్టీల నేతలు, కేంద్ర హోం మంత్రి, ప్రధాని కూడా చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని ఎద్దేవా చేసారు. దేశంలో న్యాయవ్యవస్థను దూషిస్తే , వారిపై అసభ్యపదజాలం వాడితే దానికి రాజ్యాంగంలో ఒక ఆేర్టికల్ ఉంది అని  కాని ఇతర రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని దూషిస్తే కేవలం నామమాత్రమైన సెక్షన్ మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నుండి ప్రాణహాని ఉంది కాబట్టే పట్టాభి దేశం విడిచి పారిపోయాడు అని తనను భౌతికంగా అంతమొందించి ఆ నెపాన్ని వైఎస్సార్ పార్టీ పై నెట్టేస్తాడు అని పట్టాభి భయపడుతున్నాడు అన్నారు విజయసాయి రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: