ఢిల్లీలో ఏపీ పంచాయతీ.. పార్టీలు పరువు తీసుకుంటున్నాయా..?

MOHAN BABU
వాళ్లు రాష్ట్రపతిని కలిశారు, వీళ్ళు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తారట. వాళ్లు రాష్ట్రంలో జగన్ పాలన రద్దు చేయాలని కోరారు. వీళ్లు తెలుగుదేశం పార్టీనే రద్దు చేయాలని కోరుతారటా. వాళ్లు ఢిల్లీలోనే తేల్చుకుంటాం అంటున్నారు. మేం మాత్రం గల్లీలో తేల్చుకుంటామా మేము కూడా ఢిల్లీలోనే తేల్చుకుంటాం అంటున్నారు. మంగళగిరిలో మొదలైన టిడిపి, వైసిపి వార్ ఇప్పుడు హస్తిన వీధులకు ఎక్కింది. తప్పు ప్రత్యర్థిదే అని ప్రూవ్ చేసేందుకు రెండు పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని టిడిపి కోరుతోంది. అసలు అది సాధ్యమవుతుందా..? టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వైసిపి డిమాండ్ చేస్తుంది. అది అయ్యే పనేనా..? ఢిల్లీకి చేరిన పంచాయతీలు రెండు పార్టీలను చులకన చేస్తున్నాయా..?

ఇద్దరూ కలిసి ఢిల్లీలో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఫైట్ ఏదో అదే ఢిల్లీపై చేసుంటే ప్రత్యేక హోదా వచ్చేది,కడపకు స్టీల్ ప్లాంట్ వచ్చేది, రైల్వే జోన్ పట్టాలెక్కెది, పోలవరానికి నిధులచ్చేవి. ఇంకా అనేకం వచ్చేవి. గంజాయి, డ్రగ్స్ కు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారిందంటూ టిడిపి ఆందోళన చేయడం, పట్టాభి అదుపుతప్పి మాట్లాడడం, వైసిపి నాయకులు హద్దులు దాటి దాడులు చేయడం, చంద్రబాబు దీక్షలు చేయడం ఇది ఒక క్రమపద్ధతిలో చక్కగా జరిగి పోయింది. ఆ తర్వాత అమిత్ షా  అపాయింట్మెంట్ దొరికింది. పెద్దాయనకే అన్ని చెప్పకుంటామన్న  టిడిపి నేతలు ఇప్పుడు రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరినట్లు తెలిపారు. చంద్రబాబు ప్లాన్ ఒక్కటే జగన్ ను ఇరకాటంలో పెట్టాలని. అందుకే చలో హస్తినా అని స్టార్ట్ అయ్యారు. ఎలాంటి అపాయింట్మెంట్లు  లేకపోయినా వైసీపీ నేతలు ముందస్తుగా ఢిల్లీ ప్రయాణం పెట్టుకోవడం ఇక్కడ హైలెట్.

 టిడిపి గుర్తింపు రద్దు చేయాలని వైసిపి డిమాండ్ చేస్తోంది. దీనికోసమే ఈసీని కలిసే అవకాశాలున్నాయి . నిజానికి ముఖ్యమంత్రిని పట్టాభి ఓ మాట అనగానే టిడిపి కార్యాలయాల మీదకు తమ శ్రేణుల్ని పంపింది వైసిపి . ఆఫీసులపై దాడి చేసిన వైసీపీ ఇప్పుడు అదే టిడిపి గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేయడమెంటి ఇలా ఇంటి పంచాయతీని తీసుకెళ్లి రాజధాని వీధుల్లో పెట్టడం రెండు పార్టీలను మరింత చులకన చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: