బద్వేలు: ఉప ఎన్నిక ఫలితం వైసీపీకి మేలుకొలుపు అవుతుందా..?

Deekshitha Reddy
కడప జిల్లా బద్వేలు లో జరిగే ఉపఎన్నికల చుట్టూనే ఇప్పుడు రాష్ట్ర రాజకీయం నడుస్తోంది. ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడం, పోలింగ్ కి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో పోటీలో నిలిచిన అభ్యర్థులందరూ ప్రచారంలో దూకుడు పెంచారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు. వైసీపీ తరపున ఇప్పటికే నియోజకవరం మొత్తం చుట్టేస్తూ.. ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయని చాలా ధీమాగా ఉన్నారు. బీజేపీని అస్సలు ప్రత్యర్థిగానే చూడకుండా, తమ పని చేసుకుంటూ వెళ్తున్నారు.
అయితే ఈ బద్వేల్ ఉపఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి, మెజార్టీ ఎంత అనేదే అసలు ప్రశ్న. ఈ ఉప ఎన్నికల విషయంలో వైసీపీ మొదటి నుంచి ధీమాగానే ఉంది. బద్వేల్ ప్రచారానికి సీఎం జగన్ వచ్చే అవకాశం ఉన్నా రాలేదు. అంతా పార్టీ నేతలపైనే భారం పెట్టారు. టీడీపీ, జనసేన పోటీలో లేకపోవడంతో.. వైసీపీ నాయకులు కూడా బీజేపీని లైట్ తీసుకున్నారు. అటు జనసేన, టీడీపీ కూడా బహిరంగంగా ఎక్కడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించలేదు. అండర్ కరెంట్ గా టీడీపీ సపోర్ట్ బీజేపీకి ఉందని అంటున్నారు. ఒకవేళ టీడీపీ మద్దతు ఉంటే దాని ప్రభావం ఎంత అనేది కూడా ఈ ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది.
బద్వేల్ ఉపఎన్నికల విషయంలో వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉందని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెతను గుర్తు చేస్తున్నారు. బద్వేల్ ఎన్నికల విషయంలో సీఎం జగన్ ప్రచారానికి వస్తే బాగుండేదని అనుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీకి అంతర్గతంగా టీడీపీ నేతలు మద్దతిస్తున్నారని.. అందుకే సీఎం ప్రచారం చేస్తే మరింత మెజార్టీ వస్తుందని భావిస్తున్నారు. అయితే సీఎం జగన్ ఆలోచన మరోలా ఉంది. జనసేన, టీడీపీ నేరుగా పోటీలో లేనపుడు తాను ప్రచారానికి అవసరం లేదని జగన్ భావిస్తున్నారు. అయితే బద్వేల్ ఉప ఎన్నికలలో మెజార్టీ తగ్గితే మాత్రం.. అది వైసీపీకి కచ్చితంగా మేలు కొలుపు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: