బీజేపీకి పవన్ సహాయ నిరాకరణ నేటితో సంపూర్ణం..

Deekshitha Reddy
కడప జిల్లా, బద్వేల్ లో ఉపఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగుస్తుంది. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ తరపున ఇప్పటికే వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. కడప జిల్లా నేతలతో పాటూ.. వివిధ జిల్లాల నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో ఎవరినీ వదలకుండా కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్ మాత్రం ప్రచారానికి వస్తారని మొదట భావించినా.. ఆఖరి నిమిషంలో ఆయన కూడా ప్రచారానికి రావడం లేదని చెప్పేశారు. అయితే నియోజకవర్గంలో ప్రజలకు జగన్ ప్రత్యేకంగా లేఖలు రాశారు. ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా ఉటంకిస్తూ ప్రత్యేకంగా లేఖలను తయారుచేశారు. వాటిని ప్రతీ ఇంటికి తీసుకెళ్లి వైసీపీ నేతలే అందిస్తున్నారు.
కరోనా ప్రభావం కారణంగా తాను ప్రచారానికి రావడం లేదని సీఎం జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. బద్వేల్ ఎన్నికలలో గెలిపించాలని ఓటర్లను కోరారు. సంక్షేమ పధకాల ద్వారా ఖర్చు చేసిన మొత్తం వివరాలను అందులో ప్రస్తావించారు. వైసీపీ ఈ విధంగా ప్రచారం చేస్తుంటే.. పోటీలో ఉన్న బీజేపీ మాత్రం ఓటర్లను ఆకట్టుకోలేకపోతోంది. ప్రచారానికి బీజేపీ అగ్రనేతలెవరూ రాక పోవడంతో, ఆ పార్టీ నేతల్లో సహజంగానే ఉత్సాహం తగ్గింది. చివరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి సపోర్ట్ చేయాలని ఎక్కడా నేరుగా చెప్పలేదు. కనీసం ఓ ప్రకటన కూడా విడుదల చేయలేదు. ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో ఈ రోజైనా పవన్ కళ్యాణ్ తో ప్రకటన చేయించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే బద్వేల్ ఉపఎన్నికల విషయంలో సెంటిమెంట్ ను గౌరవిస్తూ పోటీ నుంచి జనసేన తప్పుకుందని.. అందుకే ఈ ఉపఎన్నికలలో పోటీ చేయమని పవన్ ఎప్పుడో ప్రకటించేశారు. చెప్పిన మాటకు కట్టుబడి బద్వేల్ ఉపఎన్నికల విషయంలో ఆయన మౌనంగానే ఉన్నారు. జనసేన కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపైనా ఆయన క్లారిటీ ఇవ్వలేదు.  
దీనిని బట్టి అర్ధమయ్యేది ఏమిటంటే.. బీజేపీ తన నిర్ణయం కాదని బద్వేల్ లో పోటీ చేసినందుకు.. పవన్ సహాయ నిరాకరణ నేటితో సంపూర్ణం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: