ఢిల్లీ డైరీ : బీజేపీ బంధం తెంపేశాడండీ బాబూ!

RATNA KISHORE
మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగిసింది.ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ ను క‌ల‌వ‌డం మిన‌హా బాబు సాధించిందేమీ లేదు. ఈ నేప‌థ్యంలో ఒక‌ప్పుడు బాబుకు ఇప్ప‌టి బాబుకు మ‌ధ్య తేడాను గుర్తించే ప్ర‌య‌త్నం ఒక‌టి అంతా చేయాలి. ముఖ్యంగా బీజేపీతో బంధం తెగిపోయిన నేప‌థ్యంలో రాష్ట్రంలో ప‌రిణామాలు ఏ విధంగా మారిపోనున్నాయో కూడా ఒక్క‌సారి అవ‌లోక‌నం చేయాలి. ఒక‌నాడు బాబు మాటే వేదంగా బీజేపీ తో బంధం ఉండేది. అధికారంలో ఉంటుండ‌గానే బాబు రివ‌ర్స్ కావ‌డం, బీజేపీతో బంధం తెంపుకోవ‌డంతో టీడీపీ ప్ర‌యాణంలో ఎటువంటి మార్పులు వ‌స్తాయో కూడా చూడాలి. రాష్ట్రంలో ప్ర‌భుత్వ ప్రేరేపిత ఉగ్ర‌వాదం న‌డుస్తుంద‌ని చంద్ర‌బాబు చెబుతున్న‌ప్ప‌టికీ, న‌మ్మేందుకు బీజేపీ సిద్ధంగా లేద‌ని తేలిపోయింది. ఇక టీడీపీ ఆఫీసుపై అల్ల‌రి మూక‌ల దాడుల‌ను కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కేంద్రం త‌ర‌ఫున స‌మాధానం లేదు. విష్ణు వ‌ర్థ‌న్ రెడ్డి లాంటి లీడ‌ర్లు టీవీ డిబేట్ల‌లో మాట్లాడి, ఆయా సంద‌ర్భాల్లో ఖండించ‌డం మిన‌హా చేసిందేం లేదు. ఇవ‌న్నీ రేప‌టి వేళ టీడీపీకి మైన‌స్ కానున్నాయి.
రాష్ట్రంలో వైసీపీ సాధించిన విజ‌యాలు క‌న్నా వాటి వెనుక వ్యూహాలే మంచి ప్ర‌భావాన్ని చూపాయి అనేందుకు నిన్న‌టి వేళ ప‌రిణామాల‌ను చూస్తే అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే బీజేపీ కూడా టీడీపీని కాకుండా వైసీపీనే న‌మ్ముకుంటోంది. బీజేపీకి స్వామిభ‌క్తి చూపే వైసీపీ అంటేనే ఇష్టం అని తేలిపోయింది. చంద్ర‌బాబు హ‌యాం క‌న్నా జ‌గ‌న్ హ‌యాంలోనే త‌మ మాట ఎక్కువ‌గా చెల్లింద‌న్న న‌మ్మ‌కం కూడా ఇవాళ బీజేపీకి బ‌లీయంగా ఉంది. ఇవ‌న్నీ వైసీపీ బంధాన్ని బ‌ల‌ప‌రిచి చంద్ర‌బాబుపై బీజేపీకి ఉన్న న‌మ్మ‌కాన్ని బ‌ల‌హీన‌ప‌ర్చాయి. ఇదే నిన్న‌టి వేళ మోడీ తో స‌హా కేంద్ర ప్ర‌భుత్వంకు చెందిన పెద్ద‌లెవ్వ‌రూ బాబుకు అపాయింట్మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డానికి ప్ర‌ధాన భూమిక పోషించింది అనేందుకు తార్కాణం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: