పసుపు పూలు : సొంత మనుషులే వెన్నుపోటు!

RATNA KISHORE
అధికారం ఉన్నా లేక‌పోయినా చంద్ర‌బాబుకు క‌ష్టాలు మాత్రం త‌ప్ప‌డం లేదు. పార్టీని నిల‌బెట్టే క్ర‌మంలో కొన్ని కార్పొరేట్ శ‌క్తుల సాయం తీసుకోవ‌డంతో అవే ఇప్పుడు ఆయ‌న మెడ‌కు ఉచ్చు బిగిస్తున్నాయి. ఆ రోజు నారాయ‌ణ లాంటి పెద్ద‌లు, సుజ‌నా చౌద‌రి లాంటి పెద్ద‌లు రాజ‌కీయం న‌డిపారు. స‌మ‌ర్థులం అనిపించుకునేందుకు తాపత్ర‌య‌పడ్డారు. విజ‌య‌వాడ కేంద్రంగా ఇంకొంద‌రు కూడా ఇలానే వ్య‌వ‌హ‌రించారు. పార్టీకి అధికారం పోగానే అంధ‌కార‌మే మిగిలింది. నారాయ‌ణ లేడు. సుజ‌నా పార్టీ మారాడు. టీజీ వెంక‌టేశ్ లాంటి వ్యాపారస్తులు బీజేపీలో ఉన్నారు. ఇలా మొత్తంగా పార్టీకి ఇవాళ మున‌ప‌టి ప్రాభ‌వం రావ‌డం క‌ష్టం అనే క‌న్నా ఇన్నాళ్లూ ఉన్న మ‌నుగ‌డ‌ను కాపాడుకోవ‌డం క‌ష్టం. ఇలాంటి వేళ చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా కొంద‌రు మారారు. అందుకు కార‌ణం కూడా ఆయ‌నే. పార్టీలో కొంద‌రు లోకేశ్ నాయ‌క‌త్వాన్ని అంగీక‌రించ‌డం లేదు. అందుకే చాలా రోజులుగా వంశీ, నానీ లాంటి  వారంద‌రూ వ్య‌తిరేక గొంతుక‌లు వినిపిస్తున్నారు.
గ‌త కొంత కాలంగా వంశీ అనే ఎమ్మెల్యే అదే ప‌నిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. ఆయ‌న‌తో పాటు నాని కూడా..పార్టీ లో ఉన్న‌ప్పుడు మాట్లాడ‌ని వారు ఇప్పుడెందుకు గేర్ మార్చారు అన్న సందేహం వ‌చ్చినా కూడా అదంతా రాజ‌కీయంలో భాగ‌మే అని స‌ర్దుకుపోవాలి. ముఖ్యంగా కొడాలి నాని అయితే మ‌రీ ! ఘోరంగా తిడుతున్నారు. 


 ఇదే స్థాయిలో వంశీ కూడా త‌న భాష‌కు ప‌దును పెడుతున్నారు. అయితే వంశీ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ అభిమానులు మాత్రం చాలా బాధ‌ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు తెలుగుదేశం పార్టీనే త‌న‌కు భిక్ష పెట్టింద‌ని చెప్పి ఇప్పుడు జ‌గ‌న్ చెప్పిన విధంగా చంద్ర‌బాబును, ఆయ‌న కొడుకు లోకేశ్ ను తిట్ట‌డం స‌రికాద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తున్నారు. సొంత మ‌నుషులే  ఇలా చేయ‌డం చంద్రబాబును మ‌రింత మ‌నోవేద‌న‌కు గురి చేస్తోంది. లోకేశ్ నాయ‌క‌త్వాన్ని అంగీక‌రించ‌లేని నాయ‌కులకు ఎలా స‌ర్దిచెప్పాలో తెలియక చంద్ర‌బాబు తిక‌మ‌క‌ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు తాను చెప్పిన విధంగా న‌డుచుకున్న నేత‌లంతా త‌న‌పై తిరుగుబాటు చేయ‌డంతో పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలియ‌క అవ‌స్థ‌ప‌డుతున్నారు. ఓ విధంగా చాలా మంది లోకేశ్ నాయ‌క‌త్వాన్ని అంగీక‌రించ కున్నా చంద్ర‌బాబు పై ఉన్న గౌర‌వంతో మౌనంగా ఉంటున్నారు.  రేప‌టి వేళ ఈ అసంతృప్తి పెరిగితే అతి పెద్ద స‌మ‌స్యే ఇది కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: