రేవంత్ రెడ్డి కారు తనిఖీ.. తర్వాత ఏం జరిగిందంటే..!

NAGARJUNA NAKKA
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కారును పోలీసులు తనిఖీ చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కారును పోలీసులు ఆపి సోదాలు నిర్వహించారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
అంతకుముందు హుజూరాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి.. వరి వేస్తే ఉరే అన్న సీఎంకు ఎందుకు ఓటు వేయాలని ఓటర్లను ప్రశ్నించారు. కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టుల ఖర్చు పెంచారని ఆరోపించారు. కాళేశ్వరంపై 1.50లక్షల కోట్లు ఖర్చు చేశారనీ.. అందులో 30వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబానికి చేరాయని విమర్శించారు. లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించి ఇంత వరకు పూర్తి చేయలేదని మండిపడ్డారు రేవంత్.
దళిత బంధు, పేదల ఇళ్ల కోసం ఈటల రాజీనామా చేయలేదనీ.. పంపకాల తేడాతోనే ఆయన టీఆర్ఎస్ ను వీడారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్ అంటున్నారు. మరి గజ్వేల్ లో కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్, సిద్ధిపేటలో పోటీచేసిన హరీశ్ రావు స్థానికులా..? అని రేవంత్ ప్రశ్నించారు. ఇక్కడ ప్రచారం చేస్తున్న హరీశ్ సిద్ధిపేటలో దళితబంధు ఇప్పించారా..? అని అడిగారు.
అంతేకాదు ఎన్నికల్లో గెలవాలన్న కాంక్షతో తెలంగాణను తాగుబోతుల అడ్డాగా మార్చేందుకు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పనిచేస్తున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నప్పటికీ ఆయనకు టీఆర్ఎస్ మద్ధతు ఇస్తోందని.. అందుకే ఓడిపోయే గెల్లు శ్రీనివాస్ ను నిల్చోబెట్టిందని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం కొట్లాడే బల్మూరి వెంకట్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మొత్తానికి హుజూరాబాద్ లోఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. గెలుపుకోసం అన్నిపార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలని ఆరాటపడుతున్నాయి. చూద్దాం.. ఎవరు పై చేయి సాధిస్తారో.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: