ఎవ్వరికీ పట్టని బద్వేల్ బైపోల్..

Deekshitha Reddy
కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థితో పాటూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ముందుకెళ్తున్నారు. గెలిచే అవకాశాలు లేకపోయినా తమ పార్టీ ఉనికి కోసం తాపత్రయపడుతున్నారు. మరికొందరు స్వతంత్ర్య అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. మొత్తంగా ఈ ఉప ఎన్నికలకు 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బరిలో 15 మంది ఉన్నప్పటికీ వైసీపీ అభ్యర్థి దాసరి సుధ, బీజేపీ అభ్యర్థి సురేష్, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది.
బద్వేల్ ఉపఎన్నికల విషయం మొదట రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగించింది. ఎప్పుడైతే జనసేన, టీడీపీ ఉప ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నాయో.. అప్పటి నుంచి ఈ ఎన్నికల విషయంపై జనానికి ఆసక్తి తగ్గింది. ప్రతిపక్షాల అభ్యర్థులతో పోటీ లేకుండా ఎన్నికలు జరుగుతుండటంతో సహజంగానే కాస్తంత వేడి తగ్గింది. బద్వేల్ లో ఇప్పటికే వైసీపీకి చెందిన మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు మకాం వేశారు. ప్రతీరోజూ నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. బద్వేల్ సీటు కోసం తీవ్రంగానే కృషి చేస్తున్నారు. బద్వేల్ సీటు గెలుస్తామనే ధీమా కూడా ఉన్నప్పటికీ ప్రచారం మాత్రం ఆపడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలోని హుజూరాబాద్ లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలోని బద్వేల్ లోనూ ఉప ఎన్నికలొచ్చాయి. అయితే ఈ రెండింటికీ చాలా తేడా కనిపిస్తోంది. తెలంగాణాలో హోరాహోరీగా ఎన్నికల హడావుడి కనిపిస్తుంటే.. మన రాష్ట్రంలోని బద్వేల్ లో మాత్రం పెద్దగా సందడి కనిపించడం లేదు. మన మీడియా ఫోకస్ అంతా తెలంగాణలో జరిగే ఎన్నికలపైనే ఉంది. బద్వేల్ ఎన్నికల విషయంలో మీడియా కూడా లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో అసలు బద్వేల్ బైపోల్ ఎవరికీ పట్టడంలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఆ పార్టీల ప్రచారమే కనిపిస్తోంది. వైసీపీ సొంత మీడియా కూడా బద్వేల్ ఎన్నికలపై పెద్దగా ఫోకస్ చేయడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: