బాబు ఊహల‌కు మించిన జ‌గ‌న్‌..!

VUYYURU SUBHASH
టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ర‌చుగా ఒక మాట చెబుతుంటారు. ``నేను ఎంతో మంది సీఎంల‌ను చూశాను. మీ నాన్నను కూడా చూశాను. నువ్వెంత‌?!`` అని అంటూ ఉంటారు. ఇటు బ‌య‌ట‌.. అటు స‌భ‌లోనూ కూడా.. చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేస్తుంటారు. ఇది నిజ‌మే. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ కాబ‌ట్టి.. చంద్ర‌బాబు అనేక మంది ముఖ్య‌మంత్రుల‌ను చూసి ఉంటారు. కానీ.. అంద‌రిలాగా మాత్రం జ‌గ‌న్ ఆయ‌న కు క‌నిపించ‌డం లేదు. ఇటు ప్ర‌జాద‌ర‌ణ‌లోనూ.. అటు పాల‌న‌లోనూ.. మ‌రోవైపు.. ప్ర‌తిప‌క్షాల దూకుడుకు క‌ళ్లెం వేయ‌డంలోనూ.. జ‌గ‌న్‌.. ఇప్పుడు చంద్ర‌బాబుకు అడుగ‌డునా.. స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి.
చంద్ర‌బాబు ఊహించింది వేరు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. జ‌గ‌న్‌కు పాల‌న ఏం తెలుసున‌ని ఎద్దేవా చేశారు. కానీ.. రెండున్నరేళ్ల‌లో జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌లోనూ.. చంద్ర‌బాబుకు భారీ ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. నిజానికి జ‌గ‌న్ పాల‌న బాగోక‌పోతే.. ఈ త‌ర‌హా విజ‌యం సాధ్య‌మేనా ? అనేది ప్ర‌శ్న‌. అంతేకాదు.. జ‌గ‌న్ పాల‌న బాగోక‌పోయి ఉంటే.. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో టీడీపీ గెలిచేదేక‌దా..! అనే మాట‌కు చంద్ర‌బాబు ద‌గ్గర స‌మాధానం లేదు. అంతేకాదు.. గ‌తంలో వైఎస్ త‌న‌కు విలువ ఇచ్చేవార‌ని.. ప్ర‌తిప‌క్షం అంటే.. ఆయ‌న గౌర‌వించేవార‌ని.. చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పేవారు.
ఇప్పుడు ఆ త‌ర‌హా.. రాజ‌కీయాల‌కు వైఎస్ కుమారుడిగా.. జ‌గ‌న్ తిలోద‌కాలిచ్చార‌ని అంటున్నారు. నిజ‌మే కొవొచ్చు. చంద్ర‌బాబు ఆవేద‌న‌ను అర్ధం చేసుకుందాం. కానీ..బాబు .. గ‌త ఐదేళ్ల పాల‌న‌లో.. ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీకి విలువ ఇచ్చారా ? క‌నీసం స‌భ‌లో మాట్లాడే ఛాన్స్ క‌ల్పించారా ?  ప్ర‌తిప‌క్ష నేత‌గా.. జ‌గ‌న్‌ను ఆయ‌న ఎలా దూషించారు. అస‌లు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షమే లేద‌ని అన్నారు. అధికార విప‌క్షాలు రెండూ తామేన‌ని చెప్పారు. మ‌రి అప్పుడు చంద్ర‌బాబు ఇవ్వ‌ని విలువ‌.. ఇప్పుడు జ‌గ‌న్ నుంచి ఆశించ‌డం అత్యాస కాదా ?  పైగా..  చంద్ర‌బాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను చేర్చుకుని.. మంత్రి ప‌ద‌వులు ఇచ‌చ్చారు.. ఇవ‌న్నీ మ‌రిచిపోయి.. చంద్ర‌బాబు జారుడు మెట్ల‌పై విన్యాసం చేసినంత మాత్రాన ప్ర‌జ‌లు మ‌రిచిపోయార‌ని ఎలా అనుకుంటారు? అనే ప్ర‌శ్న‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.
అంతేకాదు.. వైఎస్‌ను మించి.. జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యార‌నేది వాస్త‌వం. దీనిని ఎవ‌రూ కాద‌న‌లేరు. ఇటీవ‌ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్న ముఖ్య‌మంత్రుల జాబితా విడుద‌లైతే.. ప‌క్క రాష్ట్రం కేసీఆర్ పేరు ఉంది కానీ.. జ‌గ‌న్ పేరు అందులో క‌నిపించ‌లేదు. వైసీపీ ఎమ్మెల్యేల‌పై కోపం ఉండి ఉండొచ్చు.. కానీ.. సీఎంగా .జ‌గ‌న్‌కు మంచి మార్కులే ప‌డుతున్నాయి. వైఎస్ ప్ర‌త్య‌ర్థుల‌ను ఎంత టార్గెట్ చేసినా వారి మూలాల్లోకి వెళ్లి పునాదుల‌ను క‌దిలించ‌లేదు. ఇప్పుడు జ‌గ‌న్ ఏకంగా చంద్ర‌బాబు స్థావ‌రం కుప్పం పునాదుల‌ను కూక‌టి వేళ్ల‌తో పెక‌లించేస్తూ బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. దీనిని బ‌ట్టి.. చంద్ర‌బాబు అస‌లు నిజాలు తెలుసుకుంటే.. మంచిద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: