సాయంత్రం 5గంటల తర్వాత ఆడవాళ్లు పోలీస్ స్టేషన్ కి వెళ్లకూడదా..?

Deekshitha Reddy
దేశంలో మహిళలకు భద్రత రోజురోజుకీ కరువైపోతోంది. ఎక్కడ చూసినా ఆడవాళ్లపైనా.. చిన్నారులపైనా లైంగిక దాడులు నిత్యకృత్యంగా మారాయి. కొత్తగా ఎన్ని చట్టాలు వస్తున్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. కొన్నిచోట్ల ఎన్ కౌంటర్లు జరుగుతున్నా కీచకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఏదైనా ఘటన జరిగినపుడు దేశం మొత్తం స్పందించడం.. కొన్నాళ్ళకు తిరిగి మళ్లీ అకృత్యాలు మొదలు కావడం మనదేశంలో సర్వసాధారణగా మారింది. ఆడవారు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయట తిరగ గలిగినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పాడు. అయితే బీజేపీ నేతల మాటలు వింటే మనదేశానికి ఇంకా స్వాతంత్య్రం రాలేదని అర్ధమవుతుంది.
ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్, బీజేపీ నేత బేబీ రాణి మౌర్య తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత మహిళలు ఎవరూ పోలీసు స్టేషన్ కు వెళ్లవద్దని సూచించారు. చీకటి పడిన అనంతరం అసలే వెళ్లొద్దని చెప్పారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో పోలీసు స్టేషన్ కు వెళ్లాల్సివస్తే.. మీ భర్తనో.. సోదరుడినో.. తండ్రినో తీసుకొని వెళ్లాలని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్నే లేపాయి. అధికారంలో ఉన్న పార్టీ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. మీ యోగి ప్రభుత్వంపై మీకే నమ్మకం లేదా అంటూ ఘాటుగానే విమర్శిస్తున్నారు. సమాజ్ వాద్ పార్టీతో పాటూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆమె ప్రకటనను ఖండించారు.

 
అయితే ఈ విషయం వివాదంగా మారడంతో బేబీ రాణి మౌర్య దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మహిళల భద్రత కోసం తమ ప్రభుత్వం  చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహిళలకు సత్వర న్యాయం జరిపేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి మహిళల స్వావలంబన కోసం పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మహిళలకు ఉన్న అవకాశాలను చెప్పానని.. కానీ ప్రతిపక్షాలు తన వ్యాఖ్యలను వక్రీకరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనమాటలను రాజకీయ దురుద్దేశంతోనే ఇలా వివాదాస్పదం చేశారని మండిపడ్డారు. ఏది ఏమైనా బీజేపీ నేత వ్యాఖ్యలు ఉత్తర ప్రదేశ్ లో పెను దుమారాన్నే రేపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: