కేరళ పరిస్థితి అత్యంత దారుణం..!

Podili Ravindranath
ప్రకృతి ప్రసాదంగా రాష్ట్రం కేరళ. దేవుని విడిదిగా కూడా కేరళకు మారు పేరు. కానీ కొన్నేళ్లుగా కేరళపై ప్రకృతి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుంది. వరుసగా  నాలుగేళ్లుగా ప్రకృతి మళయాళీలపై తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. 2018, 2019లో భారీ వరదలు,  గతేడాది కరోనా కేసులు... ఈ ఏడాది మళ్లీ వరదలు... ఇప్పుడు మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.... అసలు కేరళనే ప్రకృతి టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. గతేడాది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మహారాష్ట్ర తర్వాత ఎక్కువగా కేరళలోనే నమోదయ్యాయి. అయితే మరణాల రేటు తక్కువగా ఉండటంతో అంతా అక్కడి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఇక ఇతర దేశాల్లో ఇరుక్కుపోయిన వారిని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రత్యేక విమానాలు నడిపింది కేంద్రం. వీటిల్లో కేరళలోని కొచ్చి ఎయిర్ పోర్ట్ వద్ద ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఏకంగా 80 మంది వరకు ప్రయాణికులు మరణించారు.
ఓ వైపు వరదలు... మరోవైపు కరోనా వైరస్ కేరళను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కేరళను వరదలు ముంచెత్తి సరిగ్గా వారం రోజులు కూడా కాలేదు. అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో... కేరళ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురిశాయి. వరదలకు ఏకంగా 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌లు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావారణ శాఖ. దీని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళపై ఇప్పుడు కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు సగం కేసులు కేరళలోనే ఉన్నాయి. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16 వేల కేసులు దేశ వ్యాప్తంగా నమోదైతే... అందులో 9 వేల 500 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయి. అయితే మరణాల రేటు మాత్రం అత్యంత తక్కువ స్థాయిలోనే ఉంది. ఇప్పటికే కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ... వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: