కుప్పంలో ఎన్నికల కోలాహలం... వైసీపీ స్పెషల్ ఫోకస్...!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ యుద్దం కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య నువ్వేంత అంటే నువ్వేంత అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో అంతా హాట్ హాట్‌గా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల దాడులు, దీక్షలు, ఆందోళనలు... పరిస్థితి ఓ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షిణించిందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఏకంగా రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా రాష్ట్రపతినే స్వయంగా కలిసి వినతి పత్రం సమర్పించేందుకు కూడా రెడీ అయ్యారు. ఇదే విషయంపై ఇప్పటికే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు కూడా చేశారు. దీనికి కౌంటర్‌గా వైసీపీ కూడా జనాగ్రహ దీక్ష పేరుతో రెండు రోజుల పాటు నిరసనలు, ఆందోళనలు చేపట్టింది కూడా. ఇక ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే... ఏకంగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు కూడా.
అయితే రాష్ట్రంలో ఎవరిదీ పై చెయ్యి అనేది తేలేది కేవలం ఎన్నికల వల్లే. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించింది. అన్ని జిల్లా పరిషత్ స్థానాలను గెలుచుకుంది. ఇక ఏ ఎన్నిక జరిగినా కూడా మాదే గెలుపు అనేస్తున్నారు. పరిషత్ పోరులో అయితే తెలుగుదేశం పార్టీ తప్పుకుంది కూడా. బద్వేల్ ఉప ఎన్నికల్లో డాక్టర్ సుజాతమ్మకు టికెట్ ఇవ్వడంతో టీడీపీ పోటీలో లేదు. అయితే... వైసీపీ నేతల కళ్లు మాత్రం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై పడింది ఇప్పుడు. తెలుగుదేశం పార్టీని చావు దెబ్బ తీయాలంటే... చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలోనే దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పై చెయ్యి సాధించిన వైసీపీ.... ఇప్పుడు కుప్పం మునిసిపాలిటీలో వైసీపీ జెండా ఎగుర వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని మునిసిపాలిటీలతో పాటు ఎంపీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఈ ఏడాది డిసెంబర్ లోపు నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటి నుంచి కసరత్తు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: