ఎట్టకేలకు నియోజకవర్గం ఫైనల్ చేసిన లోకేష్..

Deekshitha Reddy
ఏపీలో టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడి కారణంగా చాలా విషయాల్లో క్లారిటీ వస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల నిరవధిక దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ దీక్షలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు, సీనియర్లు హాజరయ్యారు. నారా లోకేష్ కూడా గత రెండు రోజులుగా చంద్రబాబు దీక్ష చేస్తున్న పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. బాబు దీక్షకు అన్నీ తానే అయి నడిపించారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా మాట్లాడారు. పార్టీలో లోకేష్ స్థానం ఏమిటో మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరెన్ని మాట్లాడినా బాబు తరువాత తానేనని చెప్పకనే చెప్పారు.
అయితే ఇన్ని రోజులూ నారా లోకేష్ పై ప్రతిపక్ష నేతలు ఓ విమర్శ చేసేవారు. ఏ ప్రెస్ మీట్ పెట్టినా ముందు ఎమ్మెల్యేగా గెలవాలంటూ లోకేష్ ను తక్కువ చేసి మాట్లాడేవారు. ఈ విమర్శపై నారా లోకేష్ గతంలో ఎప్పుడూ స్పందించలేదు. అయితే తాజాగా జరిగిన చంద్రబాబు నిరవధిక దీక్షలో ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చేశారు. 2024 ఎన్నికలలో మంగళగిరిలో పోటీ చేసి.. తన తండ్రి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని లోకేష్ మాటిచ్చారు. అయితే మంగళగిరిలో ఓడిపోయాక, తర్వాత ఎన్నికలలో లోకేష్ మరొక నియోజకవర్గంలో పోటీచేస్తారేమో అని అందరూ భావించారు. కానీ అందరి ఆలోచనలను తప్పని రుజువు చేస్తూ లోకేష్ పూర్తి క్లారిటీ ఇచ్చారు.
నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీ క్యాడర్ లో ఉత్సాహం నింపాయి. 2024లో మంగళగిరి ఎన్నికల విషయం ఇంత ముందుగా చెప్పారంటే.. చంద్రబాబు ఏదో పెద్ద ప్లాన్ వేశారని కార్యకర్తలు అనుకుంటున్నారు. దీంతో ఇకపై లోకేష్ పూర్తి స్థాయిలో మంగళగిరి మీదే దృష్టి పెడతారని తెలుస్తోంది. నియోజకవర్గంలో సమస్యలు, వైసీపీ వైఫల్యాలపై దూకుడుగా వెళతారని కూడా సమాచారం. లోకేష్ మంగళగిరికే ఫిక్స్ అవడంతో ఇకపై అక్కడే ఎక్కువ రోజులు ఉంటారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా ప్రత్యేక ప్రణాళికలు కూడా సిద్ధం చేశారని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ మాత్రం మంగళగిరికి ఫిక్స్ అయినట్టు కచ్చితంగా తెలిసిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: